Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆగని పెట్రో ధరల పరుగు

చేతి చమురు వదిలిస్తున్న పెట్రో ధరలు !

ఆగని పెట్రో ధరల పరుగు
మరోమారు పెరిగిన ధరలు
రాజస్థాన్‌లో 120కి చేరిన పెట్రో లీటర్‌ ధర
పెట్రో ధరల పెంపు అప్రతిహతంగా సాగుతోంది. అలాగే గ్యాస్‌ ధరలు కూడా అందనంతగా ముందుకు పోతున్నాయి. రానున్న శీతాకాలంలో అనేక దేశాలు గడ్డు పరిస్ధితిని ఎదుర్కోనున్నట్లు చెబుతున్నారు. పూర్తి స్ధాయిలో ఆర్ధిక కార్యకలాపాలను సాగిస్తున్న చైనా తన అవసరాల కోసం ఎక్కడెక్కడి చమురు, గ్యాస్‌, బొగ్గును కొనుగోలు చేస్తోంది. ఐరోపా ఇబ్బందులు పడుతోంది. ధర ఎక్కువైనా స్ధానిక ఉత్పత్తి కారణంగా అమెరికాలో ఇబ్బంది లేదు. ఐరోపా గ్యాస్‌ నిల్వలు పదేండ్ల కనిష్టానికి తగ్గాయి. రష్యా గ్యాస్‌ సరఫరా చేయగలిగినప్పటికీ ఐరోపా దేశాలతో ఉన్న విభేదాల కారణంగా ముందుకు రాకపోవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే గ్యాస్‌ ఆధారిత పరిశ్రమలు, విద్యుత్‌ ఉత్పత్తి ప్రభావితం అవుతాయి. ఇప్పటికే దేశంలో విద్యుత్‌ కొరత తీవ్రం అవుతోంది. ఈ క్రమంలో పెట్రోల్‌ దరలు కూడా పెరగడం సామాన్యులకు గుబులు పుట్టిస్తోంది.

సామాన్యులకు పెట్రోల్‌ అవసరమా అని కొందరు అధికార బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను కించపరిచేవిగా ఉన్నాయి. పదిలక్షలు పెట్టి కారు కొనుక్కున్నోడు లీటర్‌ పెట్రోలు కొనలేడా అని కూడా కొందరు చేస్తున్న వ్యాఖ్యలు మంటపుట్టిస్తున్నాయి. సెప్టెంబర్‌ 28 నుంచి 19సార్లు పెట్రో ధరలు పెరిగాయి. గత మూడువారాల మొత్తంగా పెట్రోల్‌ విూద దాదాపు 6 రూపాయలు, డీజిల్‌ విూద 7రూపాయలు రూపాయలు పెరిగాయి. సెప్టెంబర్‌ 24 నుంచి 22 సార్లు పెంచారు. అంతకు ముందు మే 4 నుంచి జులై 17 మధ్య లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.11.44 పెంపు చోటుచేసుకోగా, డీజిల్‌ ధర రూ.9.14కు పెరిగింది.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతున్న కేంద్రం.. ఈమేరకు చమురు ఉత్పత్తి దేశాలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది.

అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్న కారణంగానే ప్రతి రోజూ వినియోగదారుల విూద భారం పెరుగుతోందని చెప్పి తప్పించు కుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ఓపెక్‌ దేశాలు నవంబరు నెలలో రోజుకు నాలుగు లక్షల పీపాల కంటే ఉత్పత్తిని ఎక్కువ పెంచేందుకు తిరస్కరించటం ఒక ప్రధాన కారణం. ఈ ఏడాది ఇప్పటి వరకు చమురు ధరలు 50 శాతంపైగా పెరిగాయి. కరోనా కారణంగా కుదేలైన రంగాలు తిరిగి కోలుకుంటే చమురు గిరాకీ పెరుగుతుంది. అప్పుడు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. వంద డాలర్లకు చేరే అవకాశం గురించి జోస్యాలు వెలువడుతున్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగితే వచ్చే ఏడాది 180 డాలర్లను అధిగమించవచ్చని కూడా చెబుతున్నారు.

కరోనాకు ముందు ఉన్న ఉత్పత్తి స్ధాయికి చేరుకొనే వరకు నెలకు నాలుగు లక్షల పీపాలకు మించి పెంచేది లేదని ఒపెక్‌ దేశాలు స్పష్టం చేశాయి. ఐరోపాతో సహా అనేక దేశాలలో సహజవాయు ధరలు విపరీతంగా పెరిగాయి. బొగ్గు కూడా మండుతోంది. ఈ నేపథ్యంలో అనేక విద్యుత్‌ కంపెనీలు గ్యాస్‌కు బదులు చమురు తో విద్యుత్‌ ఉత్పత్తి చవక అని ఆలోచించటం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది. అమెరికాలో ఇడా హరికేన్‌ కారణంగా మూడు కోట్ల పీపాల చమురు ఉత్పత్తి పడిపోయింది. ఇది కూడా ఓ కారణం. ఉత్పత్తి కంటే కంపెనీల వాటాదారుల లాభాలు ముఖ్యం అనుకుంటున్న అమెరికాలోని షేల్‌ చమురు కంపెనీలు ఉత్పత్తిని పరిమితంచేశాయి. ధరలు పెరిగినా ఫరవాలేదు, ఉత్పత్తి పెంచాలనే డిమాండ్‌ అమెరికా వైపు నుంచి వచ్చింది. దాన్ని ఉత్పత్తి దేశాలు ఖాతరు చేయడంలేదు.సాధారణ వినియోగదారులు, పరిశ్రమలు, కార్మికుల నుంచి రాజకీయ నాయకత్వాలకు సమస్యలు ఎదురవుతాయి. నిరసనలకు దారితీసి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినా ఆశ్చర్యం లేదు. ఇంధన సరఫరా ముప్పు గురించి ప్రతి వారూ చర్చిస్తు న్నారు గానీ పరిష్కారాలు కనిపించటం లేదు. ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం

కలిగించేందుకు పన్నులు తగ్గించటం తప్ప మరొక మార్గంలేదు. సహజవాయు ధరలపై నియంత్రణ ఎత్తి వేయటంతో ఏ రోజు కారోజు ధరల విధానం వైపు మార్కెట్‌ను నెట్టారు. మరోవైపు రష్యా నుంచి ఐరోపా దేశాలకు సహజవాయు సరఫరా చేసే గొట్టపు మార్గంపై రాజకీయ కారణాలతో అమెరికా విధించిన ఆంక్షలను ఐరోపా వ్యతిరేకిస్తోంది. దీని వలన ఎక్కువగా నష్టపోయేది ఐరోపా దేశాలే. తాము వాయు సరఫరాను పెంచుతామని తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించటం వెనుక అమెరికా పలుకుబడిని దెబ్బ తీసే ఎత్తుగడ ఉంది. దీని వలన పది శాతం ధరలు కూడా తగ్గాయి. ఇకపోతే తాము వేస్తున్న పన్నుల బాదుడు గురించి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ప్రజలకు నిజాలు చెప్పడం లేదు. జనం జేబులు కత్తిరించడం ఎలా అని ధోరణితప్ప, భారం తగ్గింపు ఆలోచనలో కేంద్రం లేదని వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలను బట్టి అర్థం చేసుకోవాలి. మిగతా వస్తువుల మాదిరే చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తెచ్చి రాష్టాల్ర ఆదాయాలకు హావిూ ఇస్తే రాష్టాల్రు ఆ విధానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నా కేంద్రం అలా చేయడం లేదు. ఇప్పటికే వంద రూపాయలు దాటిన పెట్రోలు ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలియదు. రోజుకు ఎనిమిది లక్షల పీపాల ఉత్పత్తి పెంచుతారు అన్న అనధికారిక వార్తలు వాస్తవం కాదని తేలిపోయింది.

రానున్న చలికాలంలో ఇంధన సరఫరాలు తగ్గకుండా చూడాలని చైనా ప్రభుత్వం ఆదేశిం చటం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది. మన దేశంలో చమురు ధరల పెరుగుదలకు అంతర్జాతీయ కారణాలతో పాటు నరేంద్ర మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలు కూడా దోహదం చేస్తున్నాయి. ఎగుమ తులను పెంచేందుకు మన రూపాయి విలువను పతనం కావించటం కూడా మరో కారణంగా చూడాలి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే అది మన అర్ధిక వ్యవస్ధ విూద తీవ్ర ప్రభావం చూపనుంది. బడ్జెడెట్‌ లోటు పెరిగితే సంక్షేమ చర్యలకు కోత పెడతారు. పరిమితంగా ఉన్న సబ్సిడీలను కూడా ఎత్తివే యక తప్పదు. చమురు, గాస్‌ ధరలు పెరిగితే ఎరువుల ధరలు కూడా పెరిగి రైతాంగం విూద భారాలు పెరుగుతాయి. ఇది మరొక సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు తిరస్కరిస్తూ కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. రేపటి రోజుల్లో చమురు ధరలకు వ్యతిరేకంగా జనం ఉద్యమించినా అణచివేతలను చూడాల్సి రావచ్చు.

పెట్రోల్‌ ధరలకు క్లళెం పడేది ఎప్పుడా అనిఎదురు చూస్తున్న వాహన దారులకు ధరలు వాతలు పెడుతూనే ఉన్నాయి తప్ప దిగి రావడం లేదు. దీంతో ఏ రోజుకారోజు బండి కదలడం భారంగా మారుతోంది. నవంబర్‌ మధ్య వరకు ధరల పెరుగుదల ఇలానే కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం మరోసారి పెరుగుదలతో పెట్రో రేట్లు అత్యధిక మార్క్‌ను అందుకున్నాయి. వరుసగా నాలుగవ రోజూ శనివారం 35 పైసలు పెంపుదల పెట్రోల్‌, డీజిల్‌పై కనిపిస్తోంది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢల్లీిలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.24పై., లీటర్‌ డీజిల్‌ ధర రూ.95.97పై.కు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్‌ ధర రూ.113.12పై., డీజిల్‌ రూ.104కు చేరింది. దేశంలోనే ఇంధన ధరలు పెరుగుదల కొనసాగుతోంది.

రాజస్థాన్‌ టౌన్‌ గంగానగర్‌లో. ఇక్కడ పెట్రోల్‌ ధర రూ.119.42గా కొనసాగుతోంది. ఇక డీజిల్‌ ధర రూ.110.26గా ప్రస్తుతం నడుస్తోంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.55కి చేరింది. డీజిల్‌ రూ.104.70పై వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రూ.110.98, రూ.101.86 వద్ద కొనసాగుతున్నాయి. లోకల్‌ ట్యాక్స్‌ల ఆధారంగా రేట్లలో మార్పు ఉంటుందనే విషయం గుర్తించాలి. చెన్నైలో మాత్రం పెట్రో ధరలు.. గురువారం నాటివే కొనసాగుతున్నాయి!. లీటర్‌ పెట్రోల్‌ రూ.104.22పై., డీజిల్‌ రూ.100.25పై. తమిళనాడు లో డీజిల్‌ ధర వంద దాటడం ఇదే మొదటిసారి!. ఇక సెప్టెంబర్‌ 28 నుంచి 19సార్లు పెట్రో ధరలు పెరిగాయి. గత మూడువారాల మొత్తంగా సెప్టెంబర్‌ 24 నుంచి 22 సార్లు పెంప దల కనిపించింది. పెట్రోల్‌ విూద దాదాపు 6 రూపాయలు, డీజిల్‌ విూద 7 రూపాయలు  పెంపు కనిపిస్తోంది. అంతకు ముందు మే 4 నుంచి జులై 17 మధ్య లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.11.44 పెంపు చోటుచేసుకోగా, డీజిల్‌ ధర రూ.9.14కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతున్న కేంద్రం.. ఈమేరకు చమురు ఉత్పత్తి దేశాలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది.