మా ఎన్నికల్లో అక్రమాలు నిజమే

మా ఎన్నికల్లో అక్రమాలు నిజమే

నూకల ఫోటోలను విడుదల చేసిన ప్రకాశ్‌ రాజు

’మా’ ఎన్నికల్లో అక్రమాలు నిజమేనంటూ ఇప్పడు ప్రకాశ్‌ రాజ్‌ సాక్ష్యాలు బైట పెట్టడం సంచలనంగా మారింది. ఈ నెల 10వ తేదీన జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్లో జరిగిన ’మా’ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వచ్చారు. తమ ప్యానల్‌ సభ్యులపై దాడి చేశారని, బెనర్జీని మోహన్‌ బాబు బూతులు తిట్టారని ఎన్నికల్లో వారు అక్రమంగా గెలిచారని ఆ విషయంలో తమకు అనుమానాలున్నాయని, ఇటీవల ఎన్నికల అధికారిని ప్రకాశ్‌ రాజ్‌ సీసీటీవీ ఫుటేజ్‌ కావాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

క్రిమినల్‌ రికార్డు ఉన్న వైసీపీ నేతను వెంటబెట్టుకుని పోలింగ్‌లో మంచు ఫ్యామిలీ పాల్గొన్న ఫోటోలు ప్రకాష్‌రాజ్‌ రిలీజ్‌ చేశారు. తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. ఆ ఫోటోలో ఉన్నది రౌడీషీటర్‌ నూకల సాంబశివరావుగా గుర్తించారు. రౌడీషీటర్‌ నూకల సాంబశివరావు హాల్‌లో ఉన్నట్టు సాక్ష్యాలు చూపించారు ప్రకాశ్‌ రాజ్‌. మా సభ్యులు కాని వ్యక్తులను ఎలా అనుమతించారని ప్రకాశ్‌ రాజ్‌ ప్రశ్నించారు. నూకల సాంబశివరావు అనే వ్యక్తి ఓటర్లను బెదిరించారని చెప్పారు. విష్ణు ప్యానెల్‌ బ్యాడ్జిలు పెట్టుకుని వైసీపీ కార్యకర్తలు ’మా’ ఎన్నికల్లో చొరబడ్డారని తెలుపుతూ జగన్‌, మోహన్‌బాబు, విష్ణుతో వైసీపీ కార్యకర్త దిగిన ఫోటోలను ప్రకాశ్‌ రాజ్‌ చూపారు.