తెలంగాణ భవన్‌లో నాయినికి ఘనంగా నివాళి
దివంగత నాయినికి ఘనంగా నివాళి
తెలంగాణ భవన్‌లో శ్రద్దాంజలి ఘటించిన మంత్రులు
హైదరాబాద్,అక్టోబర్22(ఆర్‌ఎన్‌ఎ): దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని టీఆర్‌ఎస్ నేతలు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు తెలంగాణ భవన్‌లో నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి కేటీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌తో
పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇదిలావుంటే హైదరాబాద్ నగరంపై దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి చెరగని ముద్ర వేశారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి మహానేత ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నడిచేవని ఆయన గుర్తు చేశారు. దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని లోయర్ ట్యాంక్‌బండ సవిూపంలోనీ పింగళి వెంకటరామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లోజరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యం బీద ప్రజల అభ్యున్నతి కోసం పరితపించిన మహానేత నాయిని నర్సింహారెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో దేవరకొండ శాసన సభ్యుడు రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.