Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దళితబంధుపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు

ఇతర ప్రాంతాల్లో అమలుచేసి చూపాలి
హుజూరాబాద్‌లో ఆపారని చెప్పి విమర్శలు మానాలి
తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో దళితులకు ఇది ఇవ్వరా?
మండిపడ్డ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు
దళితబంధు పథకాన్ని కొనసాగించాలన్న ఆలోచన ఉంటే హుజూరాబాద్‌ మినహాయించి ఇతర ఎంపిక చేసిన ప్రాంతాల్లో అమలు చేయాలని బిజెపి డిమాండ్‌ చేస్తోంది. కేవలం హుజూరాబాద్‌ కోసం ఈ పథకం ప్రవేశ పెట్టలేదని అంటూనే దీనిపై కోర్టుల్లో కేసులు వేయడం చూస్తుంటే అనుమానాలు వస్తున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంత పెద్ద పథకాన్ని ప్రారంభిస్తామా అని మంత్రి కెటిఆర్‌ చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే ఇతర జిల్లాల్లో దీనిని అమలు చేసి చిత్తశుద్దిని చాటాలన్నారు. అప్పుడు ప్రజలు నమ్ముతారని అన్నారు. అయితే దీనిని అమలుకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

దళితబంధు పథకాన్ని బంద్‌ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని చట్ట వ్యతిరేకంగా, ఈసీ నిబంధనల ఉల్లంఘనగా, తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పును కాలరాయడంగా ప్రకటించాలని కోరుతూ సీనియర్‌ జర్నలిస్ట్‌ మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ వెల్లడికి ముందే అమల్లో ఉన్న పథకాన్ని అడ్డుకునే అధికారం ఈసీకి లేదని ప్రకటించాలని, ఈసీ నిర్ణయం అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్‌, రాష్ట్రంలోని ఎన్నికల ప్రధానాధికారి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, షెడ్యూల్డ్‌ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఎండీలను పిల్‌లో ప్రతివాదులుగా చేశారు. అయితే ఇక్కడ పథకం కోసం పట్టుబట్టకుండా తెలంగాణలో మిగతా దళితులకు ముందుగా దీనిని అమలు చేసి చూపాలని రఘునందర్‌ రావు అన్నారు.

దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించాక ఒక్కో దళిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తున్నది. 2021`22 బ్జడెట్‌లో వెయ్యి కోట్లను గత మార్చి 18న మంజూరు చేసింది. జూన్‌ 27న సీఎం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి, అన్ని పార్టీ అభిప్రాయాలను స్వీకరించారు. ఆ తర్వాత చాలా కాలానికి హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ఈసీ ప్రకటించింది. కోడ్‌ విధించకముందే తెచ్చిన దళితబంధు పథకాన్ని అమలు చేయడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.

ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి జూన్‌ 12న రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఫలితంగా హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసీ గత నెల 28న షెడ్యూలు ప్రకటించింది. అయితే కొందరు స్వార్థపరులు కుట్రపూరితంగా పథకం నిలుపుదలకు ప్రయత్నించారు. అకారణంగా దళితబంధు పథకం అమలుకు బ్రేక్‌ వేయాలనే ప్రయత్నాలకు ఈసీ ఆమోదం తెలుపటం చట్ట వ్యతిరేకం. ఈసీ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వాస్తవాల్లోకి వెళ్లకుండా ఏకపక్షంగా వ్యవహరించారని అంటూ ఆయన కోర్టులో కేసు వేశారు. అమల్లో ఉన్న పథకానికి హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని నిలిపివేయడం.. గతంలో ఈసీ కేంద్రానికి లేఖ ద్వారా తెలిపిన వివరణకు విరుద్ధంగా ఉన్నదని అన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వెల్లడికి ముందు కేంద్రం దేశవ్యాప్తంగా ప్రారంభించిన సుప్ర పథకంపై అభ్యంతరం చెప్పని ఈసీ.. దళితబంధు పథకాన్ని మాత్రమే అడ్డుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదన్నారు. బీజేపీ మాత్రం హుజూరాబాద్‌లో దళితుల హక్కును కాలరాచే విధంగా వ్యవహరిస్తున్నది. ఉప ఎన్నికలో లబ్దిపొందేందుకు బీజేపీ తన దళిత వ్యతిరేకతను చాటుకున్నది. దళితబంధు పథకంపై బీజేపీ వితండవాదం చేస్తున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే బిజెపిని నిందించే ముందు ఇతర ప్రాంతాల దళితులకు ఈ పథకం పక్కాగా అమలయ్యేలా చూస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. సిద్దిపేట, గజ్వెల్‌ తదితర ప్రాంతాల్లో ముందుగా ఈ పథకం అమలు చేసి చిత్తశుద్ది చాటాలన్నారు.