Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

25న పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న కెసిఆర్‌

కెసిఆర్‌ అభినందన సభగా 27న ఎన్నికల సభ ?
సిద్దిపేట జిల్లాలో నిర్వహించేలా ప్లాన్‌
ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో మారిన వ్యూహం
హుజూరాబాద్‌లో కెసిఆర్‌ సందేశం అందాలన్న పట్టుదలతో టిఆర్‌ఎస్‌ శ్రేణులు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా ప్లాన్‌ చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్‌ డైరెక్టర్‌ తాజాగా ఇచ్చిన వివరణతో సభాస్థలం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 25న సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికకానున్న నేపథ్యంలో ఆయనను అభినందించడానికి సభ ఏర్పాటు చేసి దాని ద్వారానే హుజూరాబాద్‌ ప్రజలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలనే పిలుపునిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికల, కొవిడ్‌ కోడ్‌, వ్యయ పర్యవేక్షణ సమస్యలను అధిగమించడానికి సీఎం అభినందన సభే సరైనదన్న అభిప్రాయంలో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఉంది. ఈ మేరకు కెటిఆర్‌, ఇతర మంత్రులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 27న జరగనున్న టీఆర్‌ఎస్‌ సభ అధినేత అభినందన సభగా మారడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమ వుతున్నది. ఎలాగైనా ఈటెల రాజేందర్‌ను ఓడిరచాలన్న లక్ష్యంతో ఉన్న పార్టీ ఇప్పటికే అన్ని అస్త్రశస్త్రా లను సిద్దం చేసింది. కెసిఆర్‌ సభను అధ్యక్షుడికి అభినందన సభగా మార్చిహుజూరాబాద్‌ ప్రజలకు సందేశం ఇవ్వాలని చూస్తోంది. ఇకపోతే దళితబంధు ఆపడంపై ఇప్పటికే బిజెపిపై నిందలు వేయడం మొదలు పెట్టింది. ఈ రకంగా పథకం ఆగిపోయి మనకు డబ్బులు రాకుండా పోయాయన్న ప్రచారం దళితుల్లో కలిగిస్తోంది. ఈ క్రమంలో సిఎం కెసిఆర్‌ సభను నిర్వహించే విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న భావనలో ఉన్నారు.

ఉప ఎన్నిక ప్రచార పర్వంలో ఈ నెల 27న ముగియనుంది. ఉప ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గం ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌లో లేదా రాష్ట్ర రాజధానిలో, మెట్రోపాలిటన్‌ నగరంలో ఉంటేనే ఎన్నికల కోడ్‌ ఆ నియోజకవర్గ పరిధికి మాత్రమే వర్తిస్తుందని, వీటి పరిధిలో లేని నియోజకవర్గం అయితే జిల్లా అంతటికి కోడ్‌ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. దీంతో హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో కరీంనగర్‌, హన్మకొండ జిల్లాల్లో కోడ్‌ అమలులో ఉండనున్నది. ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో స్టార్‌ క్యాంపెయినర్లు పాల్గొనే సభల్లో కొవిడ్‌ నిబంధనల మేరకు వెయ్యి మంది హాజరయ్యేందుకు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం అనుమ తిచ్చింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనే సభకు భారీ ఎత్తున ప్రజలను సవిూకరించాలని టీఆర్‌ఎస్‌ భావించినా అది ప్రస్తుత నిబంధనల మేరకు కుదరదు. రాజకీయ కార్యకలాపాలు నియోజకవర్గ వెలుపల, జిల్లా పరిధిలో కూడా నిర్వహించే పరిస్థితి ఉన్నదని, ఇటువంటి కార్యకలాపాలు ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన సూచనల స్ఫూర్తికి విరుద్ధమని జాయింట్‌ డైరెక్టర్‌ అజయ్‌ చందక్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా సీఎం కేసీఆర్‌ పాల్గొననున్న బహిరంగ సభనుద్దేశించేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఉప ఎన్నికకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కడ నిర్వహించినా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, కొవిడ్‌, వ్యయ పర్యవేక్షణ అమలుకు సంబంధించిన సూచనల పరిధిలోకే వస్తాయని సూచించారు. అలాగే జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని పేర్కొనడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనే సభ విషయంలో కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం సభను హుజూరాబాద్‌ నియోజకవర్గానికి పొరుగునే ఉన్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలో విజయోత్సవ సభగా జరపాలన్న ఆలోచన కూడా సాగుతోంది.