అమరుల స్ఫూర్తితో పనిచేయాలి
జిల్లా పోలీసులుకు ఎస్పీ సునీల్‌దత్ సూచన
పోలీస్ సంస్మరణ దినోత్వసం సందర్బగా నివాళి
దేశ రక్షణ, ప్రజా సంరక్షణెళి ధ్యేయంగా పనిచేస్తూ విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగం నిరుపమానమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ అన్నారు. వారిని స్మరించుకుంటూ నివాళి అర్పించారు. వారు తమ విధి నిర్వహణలో ప్రాణాలు లెక్క చేయకుండా దేశం, ప్రజల కోసం పనిచేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ అమర వీరుల స్ఫూర్తిగా పనిచేయాలని అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హేమచంద్రా పురంలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం విధి నిర్వహణలో భాగంగా అమరులైన పోలీసుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు పనిచేయాలన్నారు. దేశంలో ప్రజా సంరక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ ఈ ఏడాది 377 మంది పోలీసులు అమరులయ్యారని అన్నారు. నిత్యం శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు తమ ఆరోగ్యాలపై కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా అసాంఘిక శక్తులను రూపుమాపేందుకు ప్రతీ ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఇటీవల కాలంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలను రూపుమాపాలన్నారు. మెరుగైన సమాజం కోసం ప్రజలకి అండగా ఉంటూ శాంభద్రతలను కాపాడండంలో భాగంగా ప్రతీ ఒక్కరు తమవంతు కృషి చేయాలన్నారు.