యాదాద్రి స్వర్ణగోపుర తాపడానికి విరాళాల సేకరణ

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి విమాన గోపురం స్వర్ణ తాపడానికి సీఎం కేసీఆర్‌ కిలో 16 తులాల బంగారం తొలివిరాళం ప్రకటించటంతో భక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు దేవస్థాన అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం బుధవారం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వామి వారి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించేందుకు 125 కిలోల బంగారం అవసరంకాగా, రూ. 65కోట్లు వ్యయం కానుంది. మేలిమి బంగారాన్ని రిజర్వు బ్యాంకు ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేవాదాయ, వైటీడీఏ, తదితర అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలో సంబంధిత అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు.

యాదాద్రి విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ప‌లువురు ముందుకొస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకున్న‌ ప్ర‌ణీత్ గ్రూప్ ఎండీ న‌రేంద్ర కుమార్ కామ‌రాజు 2 కిలోల బంగారాన్ని యాదాద్రికి విరాళంగా ప్ర‌క‌టించారు. చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ కిలో బంగారం, జ‌ల‌విహార్ ఎండీ రామ‌రాజు కిలో బంగారాన్ని యాదాద్రికి విరాళంగా ప్ర‌క‌టించారు.