గంజాయిపై యుద్ధం ప్రకటించాలి….. సీఎం కేసీఆర్

తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలీసు, ఎక్సైజ్‌ శాఖల అధికారులతో ప్రగతి భవన్‌ వేదికగా నిర్వహించిన సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… గంజాయిపై తీవ్ర యుద్ధం ప్రకటించాల్సిన అవసరముందన్నారు.

‘‘రాష్ట్రంలో గంజాయి సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలి. పరిస్థితి తీవ్రతరం కాకముందే అప్రమత్తం కావాలి. గంజాయి కట్టడికి డీజీ స్థాయి అధికారిని నియమించాలి. గంజాయి నియంత్రణకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి. ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ను బలోపేతం చేయాలి. మన విజయాలపై గంజాయి ప్రభావం చూపే ప్రమాదముంది. ఎంతో ఆవేదనతో ఉన్నతస్థాయి భేటీ ఏర్పాటు చేశా. గంజాయి కోసం వాట్సాప్‌ సందేశాలు పంపుకొంటున్నారు. గంజాయి సందేశాల దృష్ట్యా పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. అమాయక యువత గంజాయి బారిన పడుతున్నారు. గంజాయి ప్రభావంతో ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉంది. గంజాయి మాఫియాను అణచివేయాలి. గంజాయి నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించొద్దు. విద్యా సంస్థల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలి. సరిహద్దుల్లో చెక్‌పోస్టుల సంఖ్య పెంచాలి. నిఘావిభాగంలో మాదకద్రవ్యాలపై ప్రత్యేక విభాగం పెట్టాలి. గంజాయి కట్టడి చేసిన అధికారులకు ప్రోత్సాహకాలు ఇస్తాం. అధికారులకు నగదు బహుమతులు, ప్రత్యేక పదోన్నతులు కల్పిస్తాం. గుడుంబా, గ్యాంబ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పేకాటదందా ఆగిపోవాలి’’ అని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు.