ఇండియన్ సూపర్ లీగ్ లో హైదరాబాద్ కు తృటిలో చేజారిన విజయం.

సూపర్ విక్టరీతో  ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్ఎల్‌) ఏడో సీజన్‌ను స్టార్ట్ చేసిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ మరో విజయాన్ని జస్ట్ మిస్సయ్యింది. చివర్లో కంగారుపడి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డ్రాతో సర్దుకుపోవాల్సి వచ్చింది. బుధవారం  తిలక్ మైదాన్ గ్రౌండ్‌లో జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీ-హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన పోరులో ఇరు జట్లు నువ్వా-నేనా అంటూ పందెం కోళ్లలా పోటీ పడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరు 1-1తో డ్రా ముగిసింది.

హైదరాబాద్ తరఫున అరిడానే శాంటానా 50వ నిమిషంలో గోల్ చేయడం.. జంషెడ్‌పూర్ ఆటగాడు స్టీఫెన్‌యిజే 85వ నిమిషంలో గోల్ చేసి ఆ జట్టను పరాజయం నుంచి తప్పించాడు. తొలుత ఫస్ట్ హాఫ్‌లో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. అయితే బ్రేక్ అయిపోగానే పవన్ కుమార్ నుంచి పాస్ అందుకున్న శాంటానా మెరుపు వేగంతో కదిలి బాల్‌ను నేరుగా నెట్‌లోకి పంపి హైదరాబాద్‌ను 1-0తో ఆధిపత్యంలో నిలిపాడు. కాసేపటికే లీడ్‌ను డబుల్ చేసే మంచి అవకాశాన్ని ఆశీష్ రాయ్ వేస్టే చేశాడు.  ఈ సమయంలో జంషెడ్‌పూర్ గోల్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అయితే, ఆ జట్టు ఆటగాళ్లను హైదరాబాద్ డిఫెండర్లు స్ట్రాంగ్‌గా నిలువరించారు. 71 నిమిషంలో ఆ టీమ్ గోల్ కొట్టినప్పటికీ ఫౌల్ కావడంతో రెఫరీ దాన్ని రిజెక్ట్ చేశాడు. దాంతో హైదరాబాద్ గెలుపు దిశగా పయనించింది. 80 వ నిమిషంలో గాయంతో శాంటానా గ్రౌండ్ వీడటంతో హైదరాబాద్ కాస్త డల్ అయ్యింది. కాసేపటికే ఇన్‌సైడ్ బాక్స్ నుంచి యిజే చేసిన గోల్‌తో జంషెడ్‌పూర్ ఊపిరి పీల్చుకుంది.ఈ మ్యాచ్‌కు ముందు బెంగళూరు ఫుట్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 5 పాయింట్లతో టేబుల్లో 4వ స్థానంలో కొనసాగుతోంది.