అనంతపురం జిల్లాలో దారుణం

ప్రియురాలిపై కక్ష పెంచుకున్న ఓ ప్రియుడు మాట్లాడాలని పిలిచి చంపేశాడు. రెండు మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి కాలువలో శవమై తేలింది. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలే హత్యకు దారి తీశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన షాహిదా బేగం, రఘు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమని వీరి కుటుంబ సభ్యులు వ్యతిరేకించి వేర్వేరుగా పెళ్లిళ్లు చేయడానికి నిశ్చయించారు. దీంతో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అయితే రఘు పురుగుల మందు తాగగా షాహిదా బేగం తాగలేదు. దీంతో ఆస్పత్రి పాలైన రఘు పురుగుల మందు తాగకుండా తనను మోసం చేసి మరొకరితో పెళ్లికి సిద్దమైందని యువతిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఈ నెల 17న రాత్రి మాట్లాడాలని షాహిదాను పిలిపించి పథకం ప్రకారం హత్య చేశాడు. అయితే సదరు యువతి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు రఘుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రఘును అదుపులోకి తీసుకొని విచారించగా చంపేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం పోలీసులు కణేకల్లు మండలం తుంబిగనూరు సమీపంలోని హెచ్చెల్సీ కాలువలో తేలియాడుతున్న ఒక మృతదేహాన్ని గుర్తించారు. బయటకి తీసి చూడగా షాహిదగా నిర్ధారించారు. రఘుపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.