Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జో బైడెన్ గెలుపు ఖరారు

అమెరికా అధ్యక్ష పీఠాన్ని డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ దాదాపు కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. జో బైడెన్ తాజాగా విస్కాన్సిన్, మిచిగాన్ రాష్ట్రాలను కైవసం చేసుకోవడంతో.. ఆయన మొత్తంగా 253 ఎలక్టోరల్ ఓట్లను గెలుపొందారు. మరోపక్క ట్రంప్ 214 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. అయితే మరో ఆరు రాష్ట్రాల ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఆరు రాష్ట్రాల్లో అరిజోనా, నెవాడాలలో జో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 17 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో జో బైడెన్ విజయం సాధిస్తే.. మ్యాజిక్ ఫిగర్ 270కు జో బైడెన్ చేరుకుంటారు. ఇక్కడ జో బైడెన్ ఆధిక్యంలో ఉండటంతో జో బైడెన్ గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు.
అమెరికాలోని దాదాపు అన్ని ప్రముఖ రాష్ట్రాల నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇంకా కేవలం ఆరు రాష్ట్రాల ఫలితాలు మాత్రమే రావాల్సి ఉంది. వెలువడాల్సిన ఫలితాల్లో అరిజోనా కూడా ఒకటి. మొత్తం 11 ఎలక్టోరల్ ఓట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. అరిజోనాలో ఇంకా 6.15 లక్షల నుంచి 6.35 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందని తాజాగా అధికారులు వెల్లడించారు. అరిజోనాలో జో బైడెన్ ట్రంప్‌పై 3.4 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అరిజోనాతో పాటు అలాస్కా, జార్జియా, నార్త్ కరోలినా, నెవాడా, పెన్సిల్‌వేనియా ఫలితాలు రావాల్సి ఉంది. నార్త్ కరోలినా, పెన్సిల్‌వేనియా, జార్జియా, అలాస్కా రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించినా.. ఆయన 268 ఎలక్టోరల్ ఓట్లను మాత్రమే పొందుతారు. ట్రంప్ గెలవాలంటే ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు అరిజోనా, నెవాడాలలో ఏదో ఒక రాష్ట్రంలో విజయం సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రెండు రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచే దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు.