మిర్చి సేంద్రీయ సేద్యానికి పరం పరాగత్ కృషి యోజన పథకం

మిరప సాగులో సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పరం పరాగత్ కృషి యోజన పథకం ద్వారా నిధులు మంజూరు చేయనుందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. మంగళవారం జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ జీవిల్ నర్సింహారావు అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ భారత్ ఆత్మ నిర్బర్ పథకంలో భాగంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. తెలంగాణ మిర్చి రైతులకు ఐపీఎం, ఆర్గానిక్ ఫామింగ్ పథకాలతో పాటు శాశ్వత డ్రయ్యింగ్ ప్లాట్ ఫారాలను మంజూరు చేయాలని, వరంగల్ చపటా దేశవాళీ మిర్చి వంగడానికి జీ.ఐ గుర్తింపుని ఇవ్వాలని కమిటీని కోరినట్లు తెలిపారు. మిరుపలో ప్రధానంగా వైరస్ తెగులును తట్టుకునే వంగడాల రూపకల్పనకు పరిశోధన స్థానాలకు నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు స్పయిసెస్ బోర్డు డిడి ఇట్ట మోహనరావు, తెలంగాణ డిడి గది లింగప్ప, అంజిరెడ్డి, శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులు, పార్లమెంటు ఎంపీలు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.