Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఓటు విలువ రూ.500

 –  ఆదివారం రాత్రంతా సాగిన ప్రలోభాలు
 – అర్థరాత్రి వరకు పడిగాపులు గాసిన ఓటర్లు
 – ఏరులై పారిన మద్యం.. డబ్బు ప్రవాహం
చేవెళ్ల, మే 13 (నిజం న్యూస్) :
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత పార్టీలు ఓటర్లను ప్రభావం పెట్టే పనిలో నిమగ్నమయ్యాయి. బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా గెలుపు కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో వ్యూహాలు చేశారు. అందులో భాగంగానే మద్యం, నగదు పంపిణీలో పార్టీల నాయకులు మునిగిపోయారు. ఏది ఏమైనా గెలవాలనే ధీమాతో ఆయా పార్టీల నాయకులు అభ్యర్థుల అనుచరులు అవకాశం దొరికిన చోట ప్రలోభాలకు గురి చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నేతలు వ్యవహరించడం కలవరానికి గురిచేస్తుంది. ఆదివారం మధ్యాహ్నం నుండే పార్టీల నాయకులు చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేశారు. ఓటర్లు సైతం డబ్బు పంపిణీకి అలవాటు పడి అర్ధరాత్రి, సోమవారం తెల్లవారు జాము వరకు ఇంటి ముందే పడిగాపులు కాయడం గమనార్హం. ఒక్కో ఓటుకు ఓటుకు రూ.500 నుంచి తక్కువలో తక్కువగా రూ.300 వరకు పంపిణీ చేస్తున్నట్లు ప్రజలే బహిరంగంగా చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక పార్టీ నేత రూ.300 నుంచి రూ.400 పంపిణీ చేశారని తెలియగానే మరో పార్టీ రూ.500 చొప్పున పంపిణీ చేసినట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యాన్ని ఏరులై పారించారు నేతలు. అంతేగాక డబ్బు ప్రవాహాన్ని కొనసాగించి ఓట్లు కొనుగోలు చేసేందుకు యత్నించారు