Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

త్రిమూర్తి స్వరూపాయ నమః

మనిషి బాల్య దశ “అద్భుతం”!! ఓ గొప్ప వరం!
అమ్మానాన్నల దైవ లీల
మార్చి 23 (నిజం చెపుతాం న్యూస్): వైరా
బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు
ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు
నేను ఎలా బతకగలను?
అని అడిగాను
నువ్వేం భయపడకు
నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారు చేశాను
ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు
“అయితే సరే!
కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా
అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను
దానికి బ్రహ్మా:
“సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు“మరి
ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా“అదేం లేదులే,
నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం.
నీకు ఏ కష్టం వచ్చినా!
ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది”
అని చెప్పాడు బ్రహ్మా
మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ:
తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు
ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ
ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను
అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను:
ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు
భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను
“మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది
బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు
తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని
మరి నాన్న అంటే ఎవరు.? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.
ఆ దేవుడినే అడిగి తెలుసు కుందామని ఏడుపు మొదలుపెట్టా
“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు
అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి.?” అని అడిగాడు
అమ్మ గురించి చెప్పారు గానీ,
నాన్న గురించి ఏమీ చెప్పలేదేంటని అడిగా
“నీ జన్మకి నాంది,
నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు
“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాసతో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను
ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి
“నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు
అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి
నా కష్టం తీర్చేది అమ్మ అని
మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని
ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి.
ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు
“ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ
“నీ మీద ప్రేమ ఉంది కాబట్టే,
రోజు బయటికి వెళ్ళి కష్టపడి పనిచేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా
అర్ధం కాలేదని చెప్పాను కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు
ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని,
నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా
మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది
పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా
మా నాన్న ముఖంలోని నీరసం మాయమైంది
నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసి పోసాగింది
ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా!
అని గర్వపడటం మొదలుపెట్టా
మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా
నేను నవ్విన ప్రతి సారి,
మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది
మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలు పెట్టారు
అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి
కొన్నాళ్ళకి
నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది
నడక నేర్చుకుందామని ప్రయత్నించా, కానీ ఫలితం లేదు
పదే పదే పడిపోతూనే ఉన్నా
ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు
నేను నడవ లేక పోతున్నానని వెక్కిరిస్తున్నాడు అనుకున్నా!
“నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు
నిలబడగలిగాను
కానీ,
నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి
ఆ మహా శివుణ్ణి,
మనసులో ప్రార్దించడం మొదలుపెట్టా
తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను
ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్య పరుద్దాం అనుకున్నా
ఆ మహా శివుడికి నా మొర వినిపించ లేదేమో!
నా ప్రార్థనకి జవాబు దొరకలేదు
ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు
నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు
డమరుక నాదం లేకపోతేనేం
నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయ మిచ్చారు
ఏం మాయో తెలీదు,
నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా
నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా
నేను చిందు వేసిన ప్రతి అడుగూ నాన్న ఆనందాన్ని మరింత పెంచింది
నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి
నడవటం మొదలుపెట్టాను
కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను,
ఎవ్వరూ కనిపించలేదు, భయం వేసింది
ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా,
మరి నాకు భయమెందుకు.
ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా
ఆయన కనిపించలేదు గాని వినిపించాడు
“ఏమైంది బాలకా” అని అన్నాడు
“భయం వేసింది స్వామి,  అందుకే పిలిచా” అన్నా నేను
“భయం ఎందుకు.?
నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా.
అవును నాన్న నా వెనకే ఉన్నారు
నాకు తగినంత స్వేచ్చనిస్తూ
నా ప్రయాణాన్ని గమనిస్తూ
నన్ను తప్పటడుగు వేయనియ్యకుండా,
ఒకవేళ అలా వేసినా
తప్పులను సరిచేస్తూ
నన్ను ఏ ప్రమాదం తాకకుండా
నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు
నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలైంది
అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి
నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు
మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు
నేను పిలిచిన కొద్దీ,
నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది
నాకు ఏ అవసరం వచ్చినా,
ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు,
మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది
దేవుడు వచ్చేవాడో,
రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు
నా అవసరాలన్నీ,
నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు
కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి పోయారు
కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి
నాన్న మాట మాత్రం కొంచెం కటువుగానే ఉండేది
నేను తప్పుచేసిన ప్రతిసారీ నన్ను మండలించేవారు, మందలించిన ప్రతిసారీ ఏమిటి ఈ నాన్న అని అనిపించేది
ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాను
నీ జీవిత మజిలీ ఎలా సాగింది.?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు
మీరు నాకు ఏ “మంత్రమూ” భోదించక పోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు”
అని సమాధానం చెప్పాను గర్వంగా
అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన “మంత్రాన్ని” రోజు నువ్వు పఠిస్తుండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా
నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను
బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు “ఆశ్చర్యపోయాను”
మా “నాన్న” రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది
అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి,
(మట్టి బుర్రకి)
“అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”
మిమ్మల్ని గుర్తించలేక పోయాను,
నన్ను క్షమించండి స్వామి, అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను
ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు
నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు
ప్రేమగా హత్తుకున్నారు.
నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో
క్షమిస్తా!
కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు.
ఏమిటిది స్వామీ!
అని అడిగా ఆశ్చర్యంగా
నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించ గలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు
ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను “నాన్న” అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా
“అమ్మ” దేవుడి అంశ అయితే“నాన్న” సాక్ష్యాత్ దేవుడే
ఈ వ్యాసం ప్రతి ఒక్క నాన్నకు
నాన్నను ప్రేమించే పిల్లలకు
అంకితం
నా మనస్సును కదిలించింది.
నాన్న గొప్పదనాన్ని వచ్చే తరానికి,
యువతకు తెలియాలి.
నా బాధ్యతగా చెప్పాను
మంచిని పంచుదాం పెంచుదాం
త్రిమూర్తి స్వరూపాయ నమః