Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గ్రామాల పరిశుభ్రతే ప్రధాన లక్ష్యం

  • తడి, పొడి చెత్త వేరు చేసే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించండి
  • జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
  • యూనిసెఫ్ ప్రతినిధి బృందంతో సమీక్ష..

కరీంనగర్ బ్యూరో మార్చి 21,( నిజం చెపుతాం ) గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఇందుకు పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో చేపడుతున్న యూనిసెఫ్ కార్యక్రమాలపై గురువారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో యూనిసెఫ్ ప్రతినిధుల బృందంతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను కలెక్టర్ కు అందించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు అనేక కార్యక్ర మాలను చేపడుతున్నామని వారు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కోసం భీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నా మని పేర్కొన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాలు గ్రామాలకు మరింత చేరువయ్యేలా యూనిసెఫ్ సహకారం తీసుకుంటామని తెలిపారు. ఆ సంస్థ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసే అంశంపై ప్రజలకు విస్తృతంగా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో తడి, పొడి చెత్త వేరు చేసే అంశంపై యూనిఫామ్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాలికలకు భద్రత కల్పించడంతో పాటు ఆత్మస్థైర్యం పెంచేలా ప్రభుత్వ పాఠశాలల్లో స్నేహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నదని, బాలికలు ధైర్యంతో ముందుకెళ్తున్నారని తెలిపారు. ఆపద సమయంలో అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. రానున్న రోజులో యూనిసెఫ్ సంస్థ గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఆ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరపున తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ జిల్లాలో పచ్చదనం పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు యూనిసెఫ్ సంస్థ సహకారం కూడా అవసరమని చెప్పారు.అంతకుముందు యూనిసెఫ్ ప్రతినిధుల బృందం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జోగయ్య పల్లెను సందర్శించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. యూనిసెఫ్ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. పనులు బాగా చేపట్టారని అధికారులను అభినందించారు.ఈ సమావేశంలో యూనిసెఫ్ ఢిల్లీ ప్రతినిధి కౌశికి బెనర్జీ, వాష్ స్పెషలిస్ట్ అరలికట్టి వెంకటేశ్, సిపిఓ మురళీకృష్ణ, కొండవీటి పనింద్ర, జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి, యూనిసెఫ్ సమన్వయకర్త కిషన్ స్వామి, డిసిపిఓ శాంత, సఖి అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి, రోహిణి, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.