Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

లేఅవుట్ కు దారి లేకున్నా పర్మిషన్లు..?

ఆ ప్లాట్లకు తీసిన దారి  నాదేనని మహిళా రైతు మున్సిపల్ కమీషనర్ కు దరఖాస్తు

మున్సిపాలిటీకి 10 శాతం లేవుట్ ఇవ్వకున్నా అనుమతులు

25 లక్షలు చేతులు మారినట్లు ఊహాగానాలు

ఆర్డీవోకు  ఫిర్యాదు చేసిన అధికార పార్టీ కౌన్సిలర్

ఆ లేఖ నాది కాదంటున్న కమీషనర్

ప్లాట్ల కొన్న వారి పరిస్థితి అగమ్య గోచరమేనా

హుజూర్ నగర్, మార్చి 15(నిజం చెపుతాం):

మున్సిపాలిటీలో లేఅవుట్లను పెట్టాలంటే డీటీసీబీ నుండి పర్మిషన్లు తీసుకోవాలి. 40 అడుగుల రోడ్లను పోయాలి. విద్యుత్ సరఫరా, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి. దానితో పాటు మున్సిపాలిటీకి 10 శాతం ఇవ్వాలి. ఇవ్వని లేకుండా ప్లాట్లను అమ్మాలంటే ఎలా ..? దానికి ఉపాయం ఉంది. ప్లాట్లుగా చేయాలనుకున్న భూమిని ఒక కుంట గానో రెండు కుంటలుగానో విడదీసి నాలా పర్మిషన్లు తీసుకుని రిజిస్ట్రేషన్ చేపిస్తే చాలు. ప్లాట్లు కొన్న వారికి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ప్లాట్లు అమ్ముడు పోతాయి. అయితే ప్లాట్లను చదును చేసేటప్పుడు, రోడ్లను పోసేటప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఎవరో ఒకరు పలానా పొలాన్ని ప్లాట్లుగా చేస్తున్నారని సమాచారం ఇవ్వడంతో మున్సిపాలిటీ పాలకులు. అధికారులు గద్దల్లా వాలి పోతారు. ప్లాట్లలో హద్దులుగా పెట్టిన రాళ్లను తీసి, ముగ్గును చెడిపి హడావుడి చేస్తారు. ఇదంతా మున్సిపాలిటీకి 10 శాతం స్థలం కోసం అనుకుంటున్నారా కానే కాదు..మరి  ఎందుకనుకుంటున్నారా…  మీరు ప్లాట్లను పెట్టుకుంటే మా కేమిటని సిగ్గు లేకుండా అడుగుతారు. ప్లాట్లను పెట్టిన వారు 10 నుండి 20 లక్షల వరకు ముట్టజెప్పి, మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన స్థలాన్ని ఇవ్వకుండా నొక్కుతారు. ఆ తర్వాత ఈ పాట్లను అమ్ముకోవడం జరిగే తంతు.  ఈ డబ్బులు మున్సిపాలిటీ పాలకవర్గానికి, కమీషనర్ కు, సబ్ రిజిస్టార్ వరకు చేరుతుందన్న గుసగుసలు వినపడుతున్నాయి.

దారి లేకుండానే లేఅవుట్…?

హుజూర్ నగర్ లోని గోవిందాపురంలో 702/అ4 సర్వే నెంబర్ లో 2.01 కుంటల భూమిని లేవుట్ గా మార్చారు. వీరు ఒక కుంట నుండి రెండు కుంటలుగా చేసి నాలా పర్మిషన్లు 22 జులై 2023లో 2.01 కుంటలకు ఒకే రోజు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ లేవుట్లలో రోడ్లను పోసి లేఅవుట్లుగా విభజించారు. వీటిని ఎలాంటి అభ్యంతరం లేకుండా రిజిస్ట్రేషన్ చేయమని హుజూర్ నగర్ మున్సిపల్ కమీషనర్ 11/03/2024న లేఖ సంఖ్య జి1/ఎంసీహెచ్ఎన్ ఆర్/2024 సబ్ రిజస్టార్ కు ఇచ్చారు. దీంతో హుజూర్ నగర్ సబ్ రిజిస్టార్ ఈ నెల 14, 15 తేదీల్లో ఈ  ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసారు. ఈ తతంగమంతా ఎవరికి తెలియకుండా జరగడానికి 25 లక్షలు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. ఈ ప్లాట్లకు దారి కూడా లేదని తెలుస్తోంది. ఈ అక్రమాలను చూడలేని కొందరు కౌన్సిలర్లు ఆర్డీవోకు, మంత్రి ఉత్తమ్ కు  శుక్రవారం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

ఆ దారి నాది…అక్రమంగా వాడుతున్నారు… రెడబోతు పద్మ (రైతు)

ఈ ప్లాట్లకు దారి లేదని నాదారిని అక్రమంగా ఈ లేవుట్ కు వాడుకుంటున్నారని రెండబోతు పద్మ అనే రైతు తెలిపింది. 2016లో 50 మంది పెద్ద మనుషులతో ఈ దారి నాదని అగ్రిమెంట్ కాగితాలు రాసి ఇచ్చారని చెప్పింది. ఈ ప్లాట్లను తన దారిని అక్రమంగా వాడుకుంటున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కమీషనర్ కు దరఖాస్తును ఇవ్వడానికి వారం రోజులుగా తిరుగుతున్నట్లు చెబుతోంది.  కమీషనర్ కాసేపట్లో వస్తాను ఉండమని వారం రోజులుగా చెబుతున్నాడని ఇంత వరకు రాలేదని, తన దరఖాస్తు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చేసేదేమి లేక తన ప్రధాన దారికి రాతి స్థంభాలతో కంచెను వేసినట్లు తెలిపింది.

 

నేను ఎలాంటి లెటర్ ఇవ్వలేదు..కె. శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమీషనర్, హుజూర్ నగర్

సబ్ రిజిస్టార్ కు నేను ఎలాంటి లెటర్ ఇవ్వలేదు. నేను ఇంగ్లీష్ లో లెటర్ పంపుతాను. సబ్ రిజిస్టార్ నేను పంపినా అని చెపుతున్న లెటర్ తెలుగులో ఉంది. నాకు ఈ ప్లాట్లకు వాడిన దారి తనదని ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు.

 

నాలా పర్మిషన్లతోనే రిజిస్ట్రేషన్లు…షఫీ సబ్ రిజిస్టార్, హుజూర్ నగర్

రైతు నాలా పర్మిషన్లు తీసుకుని రావడంతో ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసానని తెలిపారు. నాలా పర్మిషన్లతో మాకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉండటంతో రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు.