Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హుజూర్ నగర్ లో బిల్ కలెక్టర్ల పేరుతో  రూ. కోటి వసూళ్ళు..?

మా సార్ కు చెప్పాం… అతి త్వరలో బిల్ కలెక్టర్  ఉద్యోగాలు పర్మినెంట్

దందాలో  ఆ నలుగురిదే ప్రముఖ పాత్ర

ఒకోక్కరి నుండి 4 నుండి 5 లక్షలు వసూలు

ఇప్పటి వరకు 25 మంది నిరుద్యోగులకు టోకరా..?

8 నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్న నకిలీ బిల్ కలెక్టర్లు

రోజూ రావడం, మున్సిపాలీటీలో కూర్చుని పోవడమే వీరి ఉద్యోగం

మరో 8 నెలల్లో ముగియనున్న పాలకవర్గం

పాపం నకిలీ బిల్ కలెక్టర్ల  గతేమిటో అర్ధం కావడం లేదంటున్న కొంతమంది కౌన్సిలర్లు

హైదరాబాద్, మార్చి 14, నిజం చెపుతాం:

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ల పేరుతో ఆ నలుగురు దందాను మొదలెట్టారు.  మేము ఇచ్చేది అవుట్ సోర్సింగ్ ఉద్యోగమే కాని,  సీడీఎంఏకు ఫైల్ పంపామని అక్కడ నుండి ఫైల్ వస్తే ఇదే ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రచారం చేస్తున్నారు.  ఇప్పటి వరకు  25 మందికి పైగా నిరుద్యోగులకు టోకరా వేసి వారి వద్ద నుండి 4 నుండి 5 లక్షలు తీసుకున్నారని కొంతమంది కౌన్సిలర్లు చెబుతున్నారు.  ఈ దందాలో ఇప్పటి వరకు కోటి రూపాయల వరకు చేతులు మారినట్లుగా తెలుస్తోంది.  ఆశ్యర్యకరమైన విషయేమిటంటే ఈ దందా ఇంకా కొనసాగుతునే ఉందని బిల్ కలెక్టర్ల పేరుతో  మరో కొంతమందికి గాలం వేస్తున్నారని చెబుతున్నారు. అధికారంలొ ఉంది మేమే. ఈ ఉద్యోగాల గురించి మా సార్ కు చెప్పాం అతి త్వరలో బిల్ కలెక్టర్  ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని చెబుతున్నారు.

ముగ్గురి బదులుగా 25 మంది నియామకం..

8 నెలల క్రితం బిల్లులను వసూలు చేయడానికి ముగ్గురు బిల్ కలెక్టర్లను అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించుకోవాలని మున్సిపాలిటీ పాలకవర్గం నిర్ణయించగా, అప్పుడు బీఆర్ ఎస్ అధికారంలో ఉండటంతో ముగ్గురిలో ఇద్దరిని బీఆర్ ఎస్ కు, ఒకరిని కాంగ్రేస్ కౌన్సిలర్లు నియమించుకోవచ్చని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది.  ముగ్గురు బిల్ కలెక్టర్లను నియమించాల్సి ఉండగా పాలకవర్గంలోని కొందరు దీనిని  ఆసరాగా తీసుకుని మున్సిపాలిటీలో ఉన్న 28 వార్డులకు ఒక బిల్ కలెక్టర్ చొప్పున 28 మంది తీసుకుంటామని ప్రచారం చేసారు.  భవిష్యత్ లో ఈ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ప్రచారం చేసారు. 12 నుండి 15 వేల వరకు జీతం ప్రారంభంలో ఉంటుందని పర్మినెంట్ అయితే 50 వేల నుండి 60 వేల వరకు జీతం వస్తుందని ప్రచారం చేసారు. వీరి ప్రచారాన్ని నమ్మిన నిరుద్యోగులు అప్పో సప్పో చేసి, వడ్డీలకు తెచ్చి డబ్బులను వీరికి ముట్ట జెప్పారు. వీరు ఒకొక్కరి నుండి 4 నుండి 5 లక్షల వరకు తీసుకున్నట్టుగా సమాచారం ఉంది.

 

రావడం, కూర్చోవడం, వెళ్లిపోవడమే వీరి పని..

అక్రమంగా నియమించిన బిల్ కలెక్టర్లు ప్రతీ రోజూ రావడం మున్సిపాలిటీలోని ఎస్ఐ గది పక్కన ఉన్న గదిలో కూర్చోవడం, తెచ్చుకున్న అన్నం తినడం ఆ తర్వాత వెళ్ళిపోవడమే వీరి ఉద్యోగం. 8 నెలలుగా వీరికి జీతాలు లేవు. ఇదేమని ఎవరైనా అడిగితే మీకు సంబంధించిన ఫైల్ సీడీఎంఏ వద్ద ఉంది. అది ఫైనల్ అయితే మీకు ఆర్డర్ వస్తుంది. అప్పుడు మీ ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. సీడీఎంఏకు కూడా 15 లక్షల నుండి 20 లక్షల వరకు ముట్టజెప్పాం. త్వరలో ఆర్డర్ వస్తుందని చెప్పడంతో నిరుద్యోగులు తమకు ఎప్పడు సీడీఎంఏ నుండి ఆర్డర్ వస్తుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. గత 8 నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నామని  నకిలీ బిల్ కలెక్టర్లు చెబుతున్నారు.

పాలకవర్గం పదవీకాలం ముగిస్తే వీరి గతేమిటి..

7  నుండి 8 నెలల్లో పాలకవర్గం పదవీకాలం ముగిసే అవకాశం ఉంది. ఈ కాలంలో వీరి ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయా, లేదా  లేకపోతే వీరి పరిస్థితి ఏమిటన్నది అగమ్య గోచరం. నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఈ 25 మంది బిల్ కలెక్టర్లను ఉంచుకుంటారా లేదా అన్నది సవాలక్ష ప్రశ్నలు. వీరిని తొలగిస్తే  నిరుద్యోగులను బిల్ కలెక్టర్ల పేరుతో మోసం చేసిన వారు, వీరి వద్దనుండి తీసుకున్న డబ్బులు  వీరికి తిరిగి చెల్లిస్తారా లేక మాయ మాటలు చెప్పి తప్పించుకుని తిరుగుతారో అర్ధం కావడం లేదని పలువురు అంటున్నారు.  మరో రెండు నెలలు చూస్తామని అప్పటి వరకు  తమ ఉద్యోగాలు పర్మినెంట్ కాకున్నా, జీతాలు  ఇవ్వకున్నా మా వద్ద నుండి డబ్బులు తీసుకున్న వారిని నిలదీస్తామమని బిల్ కలెక్టర్లుగా నియమితులైన వారు చెబుతున్నారు.