Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నేతకు షోకాజ్ నోటీసు

చేవెళ్ల,  (నిజం న్యూస్) : నవంబర్ 2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో చేవెళ్ల నియోజకవర్గ స్థానం స్వల్ప తేడా ఓట్లతో కాంగ్రెస్ పరాజయం పాలవడం అందరికీ విధితమే. అయితే ఈ అసెంబ్లీ స్థానం ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ప్రతిఒక్కరూ బహిరంగంగా చర్చించుకున్నారు. కానీ అలా జరగకుండా కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందింది.

అయితే పార్టీ ఏ కారణాల చేత ఓడిపోయిందో రివ్యూ చేసుకుంటున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరొందిన టీపీసీసీ కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం కాకుండా పార్టీ వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడినట్లు అధిష్ఠానానికి ఆధారాలతో సహా ఫిర్యాదులు అందడంతో ఎలుగంటి మధుసూదన్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై వారం లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని, పార్టీ నుండి బహిష్కరిస్తామని హెచ్చరించారు. మధుసూదన్ రెడ్డి పార్టీ కార్యకాలాపాలకు పాల్పడినట్లుగా ఆధారాలు ఉన్నాయని, వారంలో వివరణ ఇవ్వాలని కోరిన పత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులలో ఒకసారిగా చర్చ జరుగుతోంది. అలాగే ముందు నుంచే ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తీరు వివాదాస్పదంగానే కొనసాగిందని చర్చలు జరుగుతున్నాయి. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి పామేన భీం భరత్ ఎంపిక విషయంలోనూ ఈ విధంగానే వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు టికెట్ వచ్చిన తర్వాత సహకరించలేదని విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి భీం భరత్ గెలవకుండా కుట్రలు పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగానే ఎన్నికల సమయంలో కొందరు వ్యక్తులతో కలిసి పోస్టర్లు అంటించేందుకు ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ వారిని కాంగ్రెస్ కార్యకర్తలు రెడ్ హ్యండెడ్ గా పట్టుకోవడంతో వాళ్ళ స్కెచ్ రివర్స్ అయిందని, అప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిపై దుష్ప్రచారం చేస్తూ అక్కడక్కడా పోస్టర్లు అంటించడంతో కాంగ్రెస్ ఓటమి పాలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆధారాలతో సహా అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిలో భాగంగానే ఈ షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి జారీ అయిన ఈ షోకాజ్ నోటీసులు ఎలుగంటి మధుసూదన్ రెడ్డి వారంలోగా వివరణ ఇస్తారా? లేదా తనను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరిస్తారా వేచిచూడాలి.