ఆన్లైన్ చదువుల కొరకు అష్టకష్టాలు పడుతున్న ఆదివాసీ విద్యార్థులు ..సిగ్నల్ అందక వాటర్ ట్యాంక్ ఎక్కుతున్న దుస్థితి చదువుకోసం చావు బతుకులతో చెలగాటం.
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు ,రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని వ్యవస్థల మీద దాని ప్రభావం పడింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థను,ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లలు నేరుగా పాఠశాల కి వెళ్లి చదువుకోలేని దుస్థితి ఏర్పడింది. దీనితో ఆన్లైన్ విద్య అనివార్యం అయింది. నూగూరు వెంకటాపురం బర్లగూడెం గ్రామపంచాయతీ లోని విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినటం కోసం సిగ్నల్ అందక నీళ్ళ ట్యాంకులు ఎక్కి మండుటెండలో కూర్చొని క్లాసులు వినే దుస్థితి ఏర్పడింది. అంతే కాకుండా పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పనికి వెళ్లకుండా కాపలా ఉండే పరిస్థితి నెలకొంది. అసలే ఏజెన్సీ ప్రాంతం అసౌకర్యాలకు నెలవి. మారు మూల ప్రాంతం కావటం తో అధిక ఆదివాసీ గ్రామాలు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. రహదారి సౌకర్యాలు అంతంత మాత్రం ఉండే గ్రామాల్లో ఇంటర్ నెట్ సౌకర్యం మాట దేవుడు ఎరుగును. ఒక ఇంట్లో నలుగు విద్యార్థులు ఉంటె నలుగురు విద్యార్థులకు నాలుగు ఫోన్ లు కొనిచ్చే ఆర్ధిక పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులకు తల్లిదండ్రులు గురి అవుతున్నారు. నెలనెలా ఇంటర్ నెట్ బ్యాలెన్స్ 200 నుండి 300 రూపాయలు వేపించాలి, కరెంట్ బిల్లు,గ్యాస్ బిల్లు ,నీటి పన్ను,ఇంటి పన్ను,టీవీ రీఛార్జ్ ఇలా నెలకు 5000 వేల రూపాయలు బిల్లులే కట్టలేక ,మరో వైపు పనులు లేక తామంతా సినిమా కష్టాలు పడుతున్నా మని తల్లిదండ్రులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు . ఆన్లైన్ విద్య అందరికి కాదు కొందరికే అనే చందంగా మారిపోయింది అని బర్లగూడెం సర్పంచ్ కోర్సా నర్సింహమూర్తి అన్నారు.బర్లగూడేము పంచాయతీ పరిధిలో ఒక సెల్ టవర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ని కోరటం జరిగింది. ప్రభుత్వం ఆన్లైన్ విద్యను ప్రవేశ పెట్టి క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను గాలికొదిలేసిందని సర్పంచ్ విమర్శించారు. టీ శాట్ చానల్స్ కూడా మారుమూల గ్రామాల్లో ప్రసారం అవ్వటం లేదన్నారు. గ్రామాల్లో కొంతమంది చిన్నారులు కూలి పనులకు వెళ్తున్నారని వారి మీద అధికారులు దృష్టి సారించకపోతే విద్యార్ధులంతా క్రమంగా బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉందన్నారు.