Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎమ్మర్పి ధర కంటే అదనంగా బాదుడు…

  • అధిక ధరలతో మద్యం ప్రియుల జేబులు ఖాళీ
  • మోటార్ సైకిల్ ,ఆటో లలో గ్రామాలకు మద్యం సరఫరా
  • జాడ లేని అధికారుల తనిఖీలు

( ఫిబ్రవరి 03 నిజం న్యూస్ ) కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజక వర్గంలోని ఉమ్మడి మద్నూర్ మండలంలోని వివిధ గ్రామాలలో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుంది. అధిక ధరలకు బెల్ట్ యజమానులు గల్లా నింపుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. గ్రామాలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్ట్ షాపులు తెల్లవారుజామున నుంచి అర్ధరాత్రి వరకు సమయం ఎంతైనా… మద్యం దొరుకును అనే తరహాలో అందుబాటులో ఉంటున్నాయి. ఉమ్మడి మండలంలో అన్ని గ్రామాలలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నట్లు సమాచారం .పగలు రాత్రి అనే తేడా లేకుండా బెల్టు షాపు యజమానుదారులు స్థానికంగా ఉన్న వైన్స్ దుకాణాల నుండి కొనుగోలు చేసిన మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. ఇళ్ల మధ్యలో పలువురు ఇళ్లలోనే మద్యం బాటిల్లను దాచి అవసరమైన వారికి ఒక్కొక్కటిగా తీసుకువచ్చి ఇస్తున్నారు. పలు గ్రామాలలో కిరాణా దుకాణంలో ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులు అమ్ముతూ కిరాణం షాపు ముసుగులో మద్యం సీసాలు అమ్ముతున్నారు రాత్రి పగలు తేడా లేకుండా మద్యం లభించడంతో వినియోగదారులు జేబులు ఖాళీ చేసుకొని అనారోగ్యం భారిన పడుతున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిసై చెడు అలవాట్లకు పాల్పడుతున్నారు. అతి చిన్న వయసులోనే మద్యం సేవిస్తూ నిరుపేద కుటుంబాలకు భారమవుతున్నారు. రోజురోజుకు గ్రామాలలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా సాగుతున్న సంబంధిత శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవరిస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.