రేపే పోలింగ్‌.. ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం

రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న దుబ్బాక ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. దుబ్బాకలోని లచ్చపేట పాఠశాల నుంచి ఎన్నికల సిబ్బంది ఈవీఎం, ఇతర పోలింగ్‌ సామగ్రిని తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఉప ఎన్నికలో 1,98,807 మంది ఓటర్లు పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్నారు. నియోజకవర్గంలో 315 పోలింగ్‌ కేంద్రాలుండగా.. వీటిలో 89 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. కరోనా రోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పీపీఈ కిట్లను సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఆశా కార్యకర్త లేదా ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచనున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలను శానిటైజ్‌ చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పోలింగ్‌ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యూలైన్లలో ఆరు అడుగుల దూరం ఉండేలా ఇప్పటికే మార్కింగ్‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.