Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాంగ్రెస్ ఐదేళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది వేచి చూద్దాం..

౼ రైతు భరోసా ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ దావోస్ వేదికపై అబద్ధం చెప్పారని విమర్శ
౼ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే బట్టలిప్పి నిలబెడతామని హెచ్చరిక
౼ ఇప్పటి వరకు రైతుబంధు కూడా పడలేదు
౼ అధికారంలో ఉన్నామనే విషయాన్ని మరిచి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం
౼ కారు సర్వీసింగుకు పోయింది, వంద స్పీడుతో వస్తంది
౼ రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్ ను ఓటుతో కొడదాం
౼ చేవెళ్ల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్
చేవెళ్ల, జనవరి 29 (నిజం న్యూస్) :
కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది వేచి చూద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతుభరోసా ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ దావోస్ వేదికపై అబద్ధాలు చెప్పారని, కానీ రైతుబంధు కూడా ఇప్పటివరకు పడలేదన్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతీసి కొడతామని కాంగ్రెస్ నేతలు అన్నారన్నారు. రైతులను చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్‌ను రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటుతో కొడదామని పిలుపునిచ్చారు. అధికారంలో వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, దానిని కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. రుణం తెచ్చుకున్న రైతులకు మొండిచేయి చూపించారని విమర్శించారు. డిసెంబర్ 9న రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తానని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. తాము ప్రభుత్వంలో ఉన్నామనే విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయినట్లుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. పదేళ్లు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో పని చేసిందని, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడిపించామన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సమయానికి పెట్టుబడి సాయం అందించమన్నారు. అధికారంలోకి వచ్చిన యబ్బై రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు.
కారు సర్వీసింగ్ కు పోయిందని, తిరిగి వంద స్పీడుతో వస్తుందని అన్నారు. గత పదేళ్లలో పార్టీకి, కార్యకర్తల మధ్య సమన్వయ లోపించిన విషయం వాస్తవమేనన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు మూడోవంతు సీట్లను ఇవ్వడం ద్వారా బలమైన ప్రతిపక్షంగా పని చేయమని ఆదేశించారని వ్యాఖ్యానించారు.
మార్పు అనే పేరుతో అమాయకులైన ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ ప్రసంగం సామాన్య కార్యకర్త ప్రసంగం కంటే దారుణంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దని సూచించారు. ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలిచ్చిందని, ఆ హామీలను అమలు చేయకుంటే బట్టలిప్పి నిలబెడతామన్నారు. నోటికొచ్చిన హామీలిచ్చి ఇరుక్కుపోయారని విమర్శించారు. హామీల అమలుకు వంద రోజులు వేచిచూద్దామని, ఆ తర్వాత అమలుచేయకుంటే ఊరుకునే ప్రసక్తేలేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ త్వరలో ప్రజల్లోకి వస్తారని, ఫిబ్రవరి 1 వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారని చెప్పారు. దేశానికి, రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. బీజేపీ వచ్చాకే మనం బొట్టు పెట్టుకోవడం నేర్చుకున్నాం అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం పార్లమెంటులో మాట్లాడేది బీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రమేనని స్పష్టం చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలలో గెలుపోటములు సహజమేనన్నారు. ఒక బంతిని గోడకు కొడితే అంతే స్పీడుగా తిరిగి వస్తుందని, అదే విధంగా కారు కూడా వంద స్పీడు వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల అమలుకై ప్రజల పక్షన నిలబడి బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీనే ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, షాబాద్ జడ్పీటీసీ అవినాష్ రెడ్డి, శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్, చేవెళ్ల జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల మండల అధ్యక్షుడు పెద్దొల్ల ప్రభాకర్, ఉద్యమ నాయకులు దేశమోల్ల ఆంజనేయులు, గడ్డం వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ మంగలి బాల్ రాజ్, నవాబుపేట్ బీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, జహంగీర్, ళరంగారెడ్డి జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు స్వప్న, కనకమామిడి ఎంపీటీసీ గణేష్ రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.