Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భూ బాధితులకు డిప్యూటీ సీఎం భరోసా..

చందనవెల్లి భూ బాధితులకు డిప్యూటీ సీఎం భరోసా..
౼ చందనవెళ్లి భూసేకరణ అవకతవకలపై విచరణ జరిపిస్తాం
౼ నిజమైన రైతులకు పరిహారం అందేలా చూస్తాం
౼ షాబాద్ మండలం చందనవెళ్లి గ్రామ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
౼ న్యాయం చేయాలని డిప్యూటీ సీఎంను వేడుకున్న చందనవెళ్లి భూ బాధితులు
చేవెళ్ల, జనవరి 26 (నిజం న్యూస్) :
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చందనవెళ్లి గ్రామంలో పర్యటించారు.

డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా చందనవెళ్లి గ్రామానికి విచ్చేసిన భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీం భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. హైతబాద్ వద్ద క్రేన్ సహాయంతో భారీ గజమాలతో భట్టి విక్రమార్కను ఘనంగా సత్కరించారు.

ఆ తర్వాత భట్టి విక్రమార్కను ప్రచార రథంపై ఎక్కించి భారీ ర్యాలీ తీశారు. అనంతరం చందనవెళ్లి గ్రామంలో పర్యటిస్తున్న సందర్భంలో చందనవెల్లి భూ బాధితులు ఆయనను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు తీరని అన్యాయం చేసిందని వారితో మొరపెట్టుకున్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చందనవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 190లోని భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. ఎంజాయ్ మెంట్ సర్వే పేరిట భూమి లేని వారి పేర్లను భూ సేకరణలో చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు.

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తూ ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా అప్పుడు కూడా భూ భాధితులు తన దృష్టికి తీసుకువచ్చారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అవకతవకలతో భూసేకరణ జరిగిందని, భూసేకరణ పరిహారం అర్హులకు రాకుండా బోగస్ లబ్ధిదారులు తీసుకున్నారని దీనిపై విచారణ చేయాలని భూ బాధితులు కోరారని భట్టి విక్రమార్క తెలిపారు. భూ భాధితుల విజ్ఞప్తి మేరకు నిజమైన లబ్ధిదారులకు పరిహారం ఇప్పించేందుకు సమగ్ర విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు.

నిజమైన లబ్ధిదారులకు రావలసిన పరిహారం డబ్బులను కొల్లగొట్టిన దళారులపై విచారణ చేయించి, వాస్తవాలు బయటికి తీసుకువస్తామని అన్నారు. భూ బాధితులకు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటానన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పరిశ్రమలు అన్యాయం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలతో మాట్లాడకుంటే పాలన జరగదన్నారు. ప్రజలు లేని పాలన అది పాలనే కాదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలు చెప్పిన సమస్యలు విని వాటిని పరిష్కారం చేస్తేనే అది ప్రజా ప్రభుత్వం అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు వారి పర్యటనల సందర్భంగా తప్పనిసరిగా ప్రజలను కలుస్తారని చెప్పారు.

మంత్రుల పర్యటన సందర్భంగా గత ప్రభుత్వాల మాదిరిగా ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలనలో ప్రజలకు నిర్బంధాలు ఉండవని తెలిపారు. రాష్ట్ర ప్రజలు స్వాతంత్రాన్ని స్వేచ్ఛగా అనుభవించడమే తమ ప్రభుత్వ పాలన లక్ష్యమని పేర్కొన్నారు. భూ పోరాటమే తన జీవితమని భావించిన గద్దర్ అన్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తనతో పాటు చందనవెల్లికి రావడం జరిగిందని అన్నారు. చందనవెల్లి భూ బాధితుల సమస్య తన దృష్టికి వచ్చినప్పుడు గద్దర్ అన్న తప్పనిసరిగా గుర్తుకు వస్తారని చెప్పారు. జీవితమే భూ పోరాటం అని భావించిన గద్దర్ అన్నకు నిజమైన నివాళి అర్పించడం అంటే భూ బాధితులకు న్యాయం చేయడమేనని భట్టి విక్రమార్క తెలిపారు.
సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని జరిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరిన భూ బాధితులు
భూ సేకరణలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను భూ బాధితులు వేడుకున్నారు. భూసేకరణలో పట్టా దారులకు నాలుగు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు మాత్రమే రికార్డులలో చూపించి సగం భూమికీ మాత్రమే పరిహారం ఇచ్చారని, మిగతా భూమికి ఇప్పటి వరకు పరిహారం రాలేదని భూ బాధితులు వాపోయారు. 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి ప్రత్యేక జీవో ద్వారా ఎకరానికి తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే పరిహారం ఇచ్చారని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వంలో మంత్రుల పర్యటన సందర్భంగా భూ బాధితులను కలవకుండా పోలీస్ స్టేషన్ లలో నిర్భందించారని, ఇప్పుడు మాకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు భూ బాధితులు చేతులెత్తి దండం పెట్టారు. చందన వెళ్లి భూబాధితులకు సహేతుకంగా శాస్త్రీయంగా నష్టపరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు చందనవెల్లి గ్రామానికి పక్కన ఉన్న సీతారాంపూర్ లో 1148 ఎకరాలు ప్రభుత్వం తీసుకున్నదని, అక్కడ భూ బాధితులకు ఎకరానికి 21 లక్షల రూపాయల పరిహారంతో పాటు ఎకరానికి 121 చదరపు గజాల చొప్పున ఇంటి స్థలం పరిహారంగా ఇచ్చారని చందనవెల్లిలో కూడా ఇదే అమలు చేయాలని కోరారు.

రైతులు ఇచ్చిన భూముల్లో పరిశ్రమలు స్థాపించిన యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని భీం భరత్ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, పీసీసీ రాష్ట్ర నాయకులు మధుసూదన్ రెడ్డి, కార్పోరేటర్ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.