Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అక్రమ క్రషర్లపై అధికారుల కన్నెర్ర..!

*కొన్ని క్వారీలను సీజ్ చేసిన అధికారులు..!*

*అజ్ఞాతంలోకి వెళ్లిన కొందరు క్రషర్ల యజమానులు..!*

*కేసులైన వారిపై తీవ్ర సెక్షన్లు పెట్టిన అధికారులు..!*

*లక్డారం క్రషర్లలో అధికారుల తనిఖీలతో వెలుగులోకి వస్తున్న అక్రమాల పుట్ట..!*

*దాడులతో జంకుతున్న అక్రమ క్రషర్ల యజమానులు..!*

*దాడులపై స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వని అధికారుల బృందం..!*

పటాన్ చెరు జనవరి 6 (నిజం చెపుతాం)

ప్రభుత్వం మారింది పనితనం మొదలయ్యింది..!

ఇక అక్రమార్కులపై విల్లు ఎక్కుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం..!అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలోని క్రషర్లపై రాష్ట్రస్థాయి అధికారులు మొదటి బాణంతో విరుచుకుపడింది..!

ఇక్కడ జరుగుతున్న మైనింగ్ మాఫియా విచ్చలవిడి తనానికి అధికారుల బృందం విస్తూ పోయి,నివ్వెర పోయింది. అసలు లక్డారంలో ఏం జరుగుతుంది..!

ఇంత తంతు జరుగుతున్నా స్థానిక జిల్లా అధికారుల మౌనం వెనుక పరమార్థం ఏమిటో..?అని అధికారుల బృందం పూర్తిస్థాయి విచారణకు ఉపక్రమించింది..!

క్రషర్లలో అధికారుల బృందం తనిఖీలతో తవ్విన కొద్ది అక్రమాలు వెలుగుచూస్తున్నాయి..! ఇంతవరకు జరిపిన విచారణను ఉన్నతాధికారుల బృందం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించినట్లు సమాచారం.

ఇక్కడి మైనింగ్ మాఫియాను వెనకుండీ నిర్వహస్తున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.అంటూ ముఖ్యమంత్రి అధికారుల బృందానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిసింది.

గత మూడు రోజులుగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కొందరు అక్రమార్కుల గుండెల్లో డైనమెట్లు పేలుతున్నట్లు తెలుస్తుంది.ఇక్కడ జరుగుతున్న మైనింగ్ మాఫియా వ్యవహారంపై సవివరంగా కథనం..!లక్డారం గ్రామంలో సుమారు 20 వరకు క్రషర్లు,క్వారీలు ఉన్నాయి. అయితే ఇక్కడి క్రషర్లు, క్వారీలు ఇంచుమించుగా ప్రజాప్రతినిధులకు చెందినవి కావడంతో అధికారులు ఇటువైపు చూడడం మానేశారు.

ప్రతినెల క్రషర్ల యాజమాన్యాలు ఇచ్చే మామూళ్లకు తలోగ్గి లక్డారం గ్రామాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.గ్రామస్తులు అధికారుల వద్ద ఎన్ని మార్లు తమ బాధ మొరపెట్టుకున్నా వారి బాధ అరణ్య రోదనే అవుతుంది.అయితే గత మూడు రోజులుగా లక్డారం గ్రామంలోని క్రషర్లపై దృష్టి సారించిన ఉన్నతాధికారుల బృందం ఆకస్మిక తనిఖీలకు పూనుకుంది.

ఇందులో భాగంగా ఇంకా ప్రారంభం కానీ పి.ఎం.ఆర్ క్రషర్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా దాచిన ఎంతో ప్రమాదకరమైన 800 జిలేటిన్ స్టిక్స్,35 డిటోనేటర్లు,180 ఐడియల్ బూస్టర్లు,1375 ఎలెక్ట్రిక్ డిటోనేటర్లు,375 డేటా నెటలిన్ లు ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు గుర్తించి పీ.ఎమ్.ఆర్ సంస్థను సీజ్ చేశారు.

అయితే పేలుడు పదార్థాలను నిబంధనలకు విరుద్ధంగా నిలువ ఉంచితే స్థానిక అధికారుల మౌనం వెనుక పరమార్ధం ఏమిటో అర్థం కాదు.పేలుళ్లకు అనుమతులు స్థానిక పోలీసులు.జిల్లా ఎస్పీ మార్గ నిర్దేశాల ప్రకారం పేలుడు పదార్థాలను నిల్వ ఉంచుకోవలసి ఉంటుంది.

అంతేకాకుండా ఇక్కడి క్రషర్లు చాలా మటుకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా భారీ నుంచి అతివారి పేలుళ్లకు పాల్పడుతున్నా సంబంధిత శాఖ అధికారులు మొద్దు నిద్ర వహిస్తున్నారు.

రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి రావలసిన రాబడి కి గండికోడుతూ కంచె చేను మేసిన చందంగా అధికారుల తీరు మారుతుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. క్రషర్ల యాజమాన్యాలు విచ్చలవిడిగా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ముడుపుల మత్తులో జొగుతున్నట్లు లక్డారం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

అయితే ఈ క్రషర్ల వ్యవహారంపై లక్డారం గ్రామానికి చెందిన యువ నాయకుడు తుంకి చంద్రశేఖర్ గౌడ్ పోరాటం సాగించారు.అయితే ఈ వ్యవహారంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గతంలో క్రషర్ల యాజమాన్యాలను పిలిచి మొట్టికాయలు వేసినా ఫలితం శూన్యం.

జిల్లా కాలుష్య మండలి అధికారిని లక్డారం గ్రామంలోని క్రషర్ల ప్రాంతంలో ఎంబీఏంట్ ఎయిర్ పొల్యూషన్ మీటర్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

కానీ ఇక్కడ ఎలాంటి మీటర్లు లేవు అయితే ఆ యంత్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా కాలుష్య అధికారులను నిలదీసి 15 రోజుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈసీ అనుమతులు లేకుండా ఎదేచ్ఛగా పర్యావరణ వినాశనానికి పాల్పడుతూ ప్రకృతి సంపదను దోసుకుంటుంటే అడిగే వారే లేకుండా పోయారా అంటూ స్పష్టస్థాయి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు జిల్లా అధికారులపై మండిపడ్డారు.

వీటన్నింటిపై పూర్తి నివేదికతో 15 రోజుల్లో తమ ముందు హాజరు కావాలని కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు.

ఇది జరిగి సుమారు 9 నెలలు దాటినా ఇప్పటివరకు యంత్రాన్ని ఏర్పాటు చేసిన పాపాన పోలేదు రాష్ట్రస్థాయి అధికారులకు నివేదికతో సంజాయిషీ ఇవ్వాల్సిన జిల్లా అధికారులు మౌనం వహించారు.

దీన్నిబట్టి క్రషర్ల యాజమాన్యాల వద్ద జిల్లా అధికారులు ఎంత మేర వసూళ్లకు పాల్పడుతున్నారో అర్థమవుతుంది.ఇక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే ఢిల్లీ కాలుష్యంపై దేశం మొత్తం ఆందోళన చెందుతుంటే ఆ పరిస్థితిని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అధికారులు లక్డారం గ్రామంలో కాలుష్య తీవ్రతను పెంచి ఢిల్లీ తో పోటీ పడేలా చూస్తున్నారు.

లక్డారం గ్రామం ఢిల్లీ తో పాటీపడి కాలుష్యంలో ముందు వరుసలో ఉంది అంటే సంబంధిత అన్ని శాఖల అధికారుల తీరు తేటతెల్లమవుతుంది.

ఇది ఇక్కడ క్రషర్ల,క్వారీల యాజమాన్యాల వ్యవహార శైలి.ఏ క్రషర్ యాజమాన్యం కనీస నిబంధనలను పాటించడం లేదు.ప్రశ్నించిన వారిని పోలీసులతో అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయినా అధికారులు మాత్రం స్పందించరు.ఇక మైనింగ్ అధికారులు ఇంకో అడుగు ముందుకేసి వాహన యజమానుల వద్ద టన్నుకు ఇంత అంటూ నెలవారీగా మామూళ్లు కుదుర్చుకొని మైనింగ్ మాఫియా కు వత్తాసు పలుకుతున్నట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి.

అయితే గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రస్థాయి అధికారుల బృందాలు ఆకస్మిక తనిఖీలకు పాల్పడుతుండడంతో స్థానిక,జిల్లా అధికారుల్లో వణుకు మొదలైనట్లు తెలుస్తుంది.

దీంతోపాటు లక్డారం గ్రామస్తుల్లో ఆనందం కనిపిస్తుంది.పది సంవత్సరాల పాలన ముగిసి కాలుష్యం బారి నుండి మా గ్రామాన్ని కొత్త ప్రభుత్వం ఐనా రక్షించి మా గ్రామాన్ని అవహించిన మైనింగ్ మాఫియా కోరల్లోనుంచీ కాపాడాలని కోరుకుంటున్నారు.