నియంత పాలనకు చరమగీతం పాడాలి
*కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీహరి రావు..*
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో నవంబర్ 10 (నిజం చెప్పుతం)
యువత బలిదానాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, ఈ ఎన్నికల్లో ఆ పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అటు రాష్ట్రంలో ఇటు నిర్మల్ లో కుటుంబ పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో ప్రజలకు చేసింది ఏమీ లేదని, అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న సీఎం కేసీఆర్ కు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రజల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో అప్రజస్వామిక పాలనను అంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీతో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని కోరారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు హామీల పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు.
ప్రజల పార్టీ కాంగ్రెస్ అని ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉద్యమ నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేశానని, ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలన్నారు.
*భారీ ర్యాలీ..*
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీహరి రావు నామినేషన్ సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు స్థానిక భాగ్యనగర్ లోని తన నివాసం నుంచి ఈదిగాం, మంచిర్యాల చౌరస్తా నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. నియోజకవర్గంలోని పల్లె నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు అభిమానులు తరలివచ్చారు.