చిదంబర రహస్యం ఆలయ రహస్యాలివే
మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన, పురాతన ఆలయాలు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాల్లో కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండానే ఉన్నాయి.
అందులోనూ దక్షిణ భారతంలో ఉండే ఆలయాలకు అత్యద్భుతమైన ప్రత్యేకతలున్నాయి. చాలా దేవాలయాల్లో ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి.
అలాంటి దేవాలయాల్లో తమిళనాడులోన ఉన్న చిదంబర నటరాజ స్వామి దేవాలయం ఒకటి.
ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి.
పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొక్కటే.
పంచ భూతాలలో ఒకటైన ఆకాశతత్త్వానికి ప్రతీకగా ఈ ఆలయంను పరిగణిస్తారు.
చిదంబర రహస్యం అని ఎందుకంటారు
పంచభూతలింగాల్లో ఒకటైన చిదంబంరం ఆలయం నుంచే వచ్చింది ఈ చిదంబర రహస్యం అనేమాట..
అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని , అసలు తెలియకుండా దాచి పెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనడం మొదలెట్టారు.
చిదంబరంలో చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం అని అర్ధం.
భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ…
ఈ ఆలయంలో మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే ఉంటుంది.
ఆ వెనుక ఏమీ ఉండదని తెలిసినా ఆలయ పూజారులు పరదాను కడతారు.
ఈ పరదాను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి.
ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగులో, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగులో ఉంటుంది.
నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు.
గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై ‘యంత్ర’ అనే చిత్రం ప్రతిబింబిస్తుంది.
పంచభూతలింగాల్లో ఇది ఒకటి…
సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. అవి జలం, తేజం, వాయువు, ఆకాశం, భూమండలం. ఆ పంచభూతాలు సైతం తానే అంటున్నాడు శివుడు.
పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగ స్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిశాడు. అవి
పృథ్విలింగం(కంచిలో ఉంటుంది), ఆకాశలింగం(చిదంబరంలో ఉంది), జలలింగం (జంబుకేశ్వరంలో), అగ్ని (అరుణాచలంలో), వాయులింగం(శ్రీకాళహస్తిలో ఉంది). ఈ ఐదు లింగాలను పంచభూతలింగాలు అంటారు.
వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది.
ఆలయ చరిత్రను ఒక సారి పరిశీలిస్తే…
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఈ చిదబంర ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ టక్కున గుర్తొచ్చే పేరు నటరాజ స్వామి ఆలయం.
చిదంబరం అంటే ఆకాశ లింగం అని అర్థం.
ఈ దేవాలయంలో మహా శివుడు నటరాజ స్వామి రూపంలో దర్శనమిస్తాడు. పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు.
శ్రీకాళహస్తిని వాయువుకు ప్రతీకగా, కంచిలోని ఏకాంబరేశ్వరుడిని భూమికి ప్రతీకగా చెబుతారు. ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉంటాయి.
శాస్త్రీయ పరంగా 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం పై ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఆశ్చర్యకమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు.
చిదంబరం ఆలయంలో అద్భుతాలు ఇవే..
చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు
మనిషి రోజుకి 21,600 సార్లు గాలి పీలుస్తాడు..ఇందుకు సూచికగా చిదంబరం దేవాలయంలో పైన 21,600 బంగారపు రేకులు తాపడం చేశారు.
ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెబుతుంది.
చిదంబరం దేవాలయంలో “పొన్నాంబళం” కొంచెం ఎడమ వైపు ఉంటుంది. అది మన హృదయ స్థానం. అక్కడకి వెళ్ళడానికి “పంచాక్షర పడి” ఎక్కాలి. అది న+మ+శి+వ+య పంచాక్షరిని సూచిస్తుంది.
“కనక సభ”లో 4 స్తంభాలు ఉన్నాయి. ఇవి 4 వేదాలకు ప్రతీకలు.
పొన్నాంబళంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు
9 కలశాలు 9 రకాల శక్తికి,
అర్ధ మంటపంలోని 6 స్తంభాలూ 6 శాస్త్రాలకు ప్రతీక
పక్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలూ 18 పురాణాలకి సూచిక
చిదంబరం ఆలయంలోని నటరాజ స్వామి విగ్రహం కాలి బోటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని పాశ్యాత్య శాస్త్రవేత్తలు ఎనిమిదేల్ల పరిశోధనల అనంతరం స్పష్టం చేశారు.
అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది.
నటరాజు భంగిమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డ్యాన్స్ అని అభివర్ణించారు.
మూలవర్ చెప్పిన ఈ విషయాలన్నీ శాస్త్ర సమ్మతాలని నిరూపించేందుకు పాశ్చాత్య శాస్త్రవేత్తలకు ఎనిమిదేళ్లకు పైగా సమయం పట్టడం గమనార్హం.
ఇక్కడ లింగ దర్శనం ఉండదు..అంతా శూన్యమే. నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.
ఈ గుడిలో నటరాజ స్వామిని దర్శం చేసుకుని బయటికొచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనుకే వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇదండీ చిదంబర రహస్యం…
ఈ సారి మరో అంతుచిక్కని రహస్యంతో కలుద్దాం..