Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చేవెళ్ల నియోజకవర్గానికి పరిశ్రమలు క్యూ..కేటీఆర్

● ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

● రెండు దిగ్గజ కంపెనీల యూనిట్లకు శంకుస్థాపన

● సీతారాంపూర్‌లో రూ.1,200 కోట్లతో కిటెక్స్‌ గ్రూప్స్‌ రెండో యూనిట్‌

● చందనవెల్లిలో రూ.272 కోట్ల పెట్టుబడితో సింటెక్స్‌ మూడో యూనిట్‌

● హాజరైన మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి

*చేవెళ్ల, సెప్టెంబర్ 28 (నిజం న్యూస్) :*

ఔటర్‌ నుంచి అరగంట ప్రయాణం, ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఐటీ కారిడార్‌కు చేరువాలో విస్తరిస్తున్న అంతరాష్ట్ర రహదారితో అనుసంధానం వంటి అనుకూలతల నేపథ్యంలో చేవెళ్ల వైపుగా పారిశ్రామిక వేత్తలు పరుగులు తీస్తున్నారని, ఈ ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెలంగాణ దూసుకుపోతుందన్నారు.

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలో పర్యటించారు. షాబాద్ మండలంలోని సీతారాంపూర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులనుద్దేశించి మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు.

అంతకుముందు జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం చందనవెల్లి, సీతారాంపూర్‌లలో రూ.1,472 కోట్లతో ఏర్పాటు చేసిన రెండు పరిశ్రమల యూనిట్లకు మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యలతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

దుస్తుల తయారీలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన కిటెక్స్ గ్రూప్‌ వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో మొదటి యూనిట్‌ను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు రెండో యూనిట్‌ను 250 ఎకరాల్లో రూ.1,200 కోట్ల వ్యయంతో షాబాద్ మండలం సీతారాంపూర్‌లో ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ ద్వారా ఏకంగా 11వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని మంత్రి తెలిపారు.

ఇందులో 80 శాతం ఉద్యోగాలను మహిళలకే ఇవ్వనున్నట్టు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే సింటెక్స్ సంస్థ ఇప్పటికే షాబాద్‌ మండలంలోని చందనవెల్లిలో వెల్‌స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్, వెల్‌స్పన్ అడ్వాన్స్‌డ్ మెటిరీయల్స్ పేరిట రెండు యూనిట్లను నెలకొల్పగా, ప్రస్తుతం రూ.272 కోట్లతో మూడో యూనిట్‌ను ఏర్పాటు చేసేందన్నారు.

50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ ద్వారా మరో 650 మందికి ఉద్యోగావకాశాలను ఈ సంస్థ కల్పించనున్నదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశంతో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో దేశ విదేశీ పెట్టుబడిదారులు వారి పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రంలో పెట్టడానికి పోటీపడి ముందుకు వస్తున్నారని అన్నారు.

రంగారెడ్డి జిల్లా పరిశ్రమల జిల్లాగా మారిందని దీని ద్వారా వేల మందికి ఉద్యోగ కల్పన ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. షాబాద్ మండలం ప్రపంచ చిత్ర పటం లోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు కృషి అని చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, టిఎస్ఐఏసి ఎండి వెంకట్ నర్సింహారెడ్డి, వెల్‌స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకా, కిటెక్స్ జాకబ్, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, షాబాద్ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి, షాబాద్ ఎమ్మార్వో, షాబాద్ ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు.