ఘరానా మోసగాడు అరెస్ట్
౼ నగదు స్వాధీనం
౼ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
౼ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి
*చేవెళ్ల, సెప్టెంబర్ 27 (నిజం న్యూస్) :*
అమాయకులైన ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసాలకు పాల్పడే ఓ ఘరానా మోసగాడిని రాజేంద్రనగర్ ఎస్ఓటి మరియు చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా చేదించి పట్టుకున్నారు.
బుధవారం రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. వారి వివరాల ప్రకారం వెస్ట్ గోదావరి జిల్లా చాగల్లు గ్రామానికి చెందిన కంది బోయిన గంగ అమరేశ్వర్ నాథ్(28) తల్లిదండ్రులు శ్రీనివాసరావు, లక్ష్మీ ప్రియ లతో హైదరాబాదులో స్థిరపడ్డాడు. తండ్రి వృత్తిరీత్యా ప్రైవేట్ టీచర్, తల్లి గృహిణి. అతనికి ఒక చెల్లెలు కలదు.
తను అమెరికాలో ఉంటుంది. అమరేశ్వర్ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో గల భాష్యం స్కూల్లో చదివాడు.
తర్వాత విజయవాడలోని శ్రీ గాయత్రి కాలేజ్ నందు ఇంటర్మీడియట్ చదివి, ఆ తర్వాత చెన్నైలోని సవిత యూనివర్సిటీ నందు 2016 వ సంవత్సరంలో బిఈ పూర్తిచేసుకుని అదే సంవత్సరంలో ఏప్రిల్ నెలలో విప్రో బెంగళూరు సాఫ్ట్ వేరు ఉద్యోగం రావడంతో అతను బెంగళూరుకు వెళ్లి అక్కడే ఉండి పనిచేసినాడు.
ఆ తర్వాత 2018 వ సంవత్సరంలో అతనికి స్పాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఆఫర్ రాగా నచ్చి ఆ కంపెనీ లోకి మారాడు. అలా పని చేసుకుంటూ ఉండగా 2020 సంవత్సరంలో కరోనా లాక్ డౌన్ ఉండడం వల్ల అమరేశ్వర్ బెంగళూరు నుండి హైదరాబాద్ కు వచ్చి నానక్ రామ్ గూడలో అతని కంపెనీ క్వార్టర్స్ లో ఉండేవాడు.
అయితే లాక్ డౌన్ లో అతనికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో అమాయక ప్రజలను తన మాయ మాటలతో నమ్మించి మోసం చేసి వారి వద్ద నుండి డబ్బులు కాజేయాలని అనుకున్నాడు.
ఆ విధంగా ఆగస్టు 2020లో ఒక బైకు అద్దెకు తీసుకొని మాదాపూర్ లోని ఓల్డ్ ముంబాయి ఐస్ క్రీమ్ వద్దకు వెళ్లి అక్కడ ఆ షాప్ ఓనర్ తో నా వద్ద వంద రూపాయల నోట్లు ఉన్నాయని వాటిని తీసుకొని ఐదు వందల రూపాయల నోట్లు కావాలని అడగగా ఆ షాప్ ఓనర్ సరేనని పదివేల రూపాయల ఐదు వందల నోట్లు ఇచ్చినాడు.
అప్పుడు ఆ ఓనర్ తో డబ్బులు బయట ఉన్నాయి నాతోపాటు వస్తే ఇస్తానని చెప్పగా ఓనర్ తనతో పాటు బయటకు వచ్చాడు. ఆ ఓనర్ ని తన బైక్ పైన ఎక్కించుకుని కొంత దూరం తీసుకెళ్లి ఇక్కడే ఉండు మళ్ళీ వస్తానని చెప్పి ఆ ఓనర్ ని కొంచెం దూరంలో దింపేసి అతను పరారయ్యాడు.
ఆ తర్వాత 2020 డిసెంబర్ లో మరలా మాదాపూర్ లోని బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ పార్లర్ కు వెళ్లి అక్కడ కూడా అదేవిధంగా మాయమాటలు చెప్పి ఆ షాప్ ఓనర్ ను కూడా నమ్మించి అతని వద్ద ముప్పై మూడు వేల ఏడు వందల రూపాయలు తీసుకున్నాడు. అదేరోజు మాదాపూర్ లోని గ్లామ్ సెలూన్ కి వెళ్లి అక్కడి షాప్ ఓనర్ నుండి పదివేల రూపాయలు తీసుకున్నాడు.
అతను చేసిన మోసాలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2020 డిసెంబర్ లో మాదాపూర్ పోలీసులు అమరేశ్వర్ నాథ్ ను పట్టుకొని జైలుకు పంపారు. ఆ విధంగా అతను ఒక నెల రోజులపాటు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చి కొద్ది రోజులు ఎటువంటి మోసాలు చేయకుండా ఊరుకున్నాడు.
తర్వాత 2021 మార్చిలో శంకర్ పల్లి లోని వ్యాన్ హుస్సేన్ క్లాత్ స్టోర్ కు వెళ్లి ఆ షాప్ ఓనర్ నుండి పదివేల రూపాయలు అదేవిధంగా మోసం చేసి తీసుకున్నాడు.
ఈ విషయమై శంకర్ పల్లి పోలీసులు అతనిని రెండు నెలలు రిమాండ్కు పంపగా జైలులో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చాడు. మరల 2021 జులైలో బెంగళూరుకి వెళ్ళాడు. అక్కడే కొన్ని నెలలు ఉండి, ఆ తర్వాత 2023 జూలైలో మరల నానక్ రాంగూడ కి వచ్చి ఇక్కడే ఉన్నాడు.
అయితే ఆ సమయంలో తన తండ్రికి ఒక ఆపరేషన్ కావడంతో మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో తను మళ్ళీ సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశం ఏర్పడి తన ఎరుపు రంగు గల TS 08 TR 0168 కొత్త స్కూటీని 05 ఆగస్టు 2023 రోజున తార్నాకలోని ఓయూ పీఎస్ పరిధిలో గల కరాచీ బేకరీ వారి నుంచి 50 వేల రూపాయలు, గచ్చిబౌలి పిఎస్ పరిధిలోని గోపీచంద్ అకాడమీ సెలూన్ 17 వేల రూపాయలు, మొయినాబాద్ పిఎస్ పరిధిలోగల ఉడిపి హోటల్ వారి నుండి 12 వేల రూపాయలు, చేవెళ్ల పీఎస్ పరిధిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వారి నుండి 57 వేల నాలుగు వందల రూపాయలు, మైలార్ దేవరపల్లి పిఎస్ పరిధిలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వారి నుండి 50 వేల రూపాయలు, రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో గల బార్ అండ్ రెస్టారెంట్ వారి నుంచి 16 వేల రూపాయలు
మరియు నార్సింగ్ పిఎస్ పరిధిలో గల రత్నదీప్ సూపర్ మార్కెట్ వారి నుంచి 16 వేల రూపాయలు వీరందరినీ తన మాయ మాటలతో మోసం చేసి మొత్తంగా 2 లక్షల 18,400 రూపాయలు తీసుకొని తన వేరు వేరు అకౌంట్ లలో డిపాజిట్ చేసుకొని మరియు తన తండ్రి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు.
తనపై కేసులు నమోదుచేసి రిమాండ్ కు పంపుతామని డీసీపీ వెల్లడించారు.
ఈ విధంగా అమాయకులైన ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ సులభంగా డబ్బులు సంపాదించాలని చాలామంది సమాజంలో తిరుగుతూ ఉంటారని కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో చేవెళ్ల డివిజన్ ఏసిపి ప్రశాంత్ రెడ్డి, చేవెళ్ల సిఐ లక్ష్మారెడ్డి ఎస్సై ప్రదీప్, తదితర పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు.