Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గాయాలపాలైన జాగిలానికి చికిత్స

మానవత్వం చాటుకున్న సుమ

మహబూబాబాద్, టౌన్ రిపోర్టర్, సెప్టెంబర్ 15,(నిజం న్యూస్)

వంటిపై తీవ్ర గాయమై, ఆ గాయంలో పురుగులుపడి నరకయాతన అనుభవిస్తున్న ఓ జాగిలానికి ‘నేనుసైతం’ స్వచ్చంద సేవా సంస్థ సభ్యురాలు, జంతు ప్రేమికురాలు మహ్మద్ సుమ చికిత్స చేయించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.

పట్టణంలోని మూడుకొట్ల సెంటర్ లో ఉన్న ఆ జాగిలం వంటిపై కొంతభాగం చర్మం ఊడిపోవడంతో ఈగలు ముసురుతూ తీవ్ర అవస్థ పడుతుండడం సుమ దృష్టిలో పడింది.

దీంతో ఆమె వెంటనే స్పందించి ఫోన్ ద్వారా పశువైద్యుల సహాయాన్ని కోరింది. వారి ఆదేశాల మేరకు ఏబీసీ సెంటర్ బాద్యులు అక్కడికి చేరుకొని ఆ జాగిలాన్ని వలలో పట్టి పశు వైద్యశాలకు తరలించడంతో వైద్యులు బొల్లం మల్లయ్య, బోళ్ళ రాజేష్ రెడ్డి, సత్వర చికిత్సను అందించారు.

అనంతరం సుమ మాట్లాడుతూ జాగిలంపై ఎవరో వ్యక్తులు మరిగే నీళ్ళను పోయడం వల్ల ఆ గాయమైనట్లు ఉందన్నారు. గాయమై చాలా రోజులు కావడంతో అందులో పురుగులు చేరి జాగిలం తీవ్ర అనారోగ్యం పాలైందన్నారు.

పశు వైద్యుల సహకారంతో జాగిలానికి ప్రమాదం తప్పిందని అన్నారు. మూగజీవాలపై విచక్షణారహితంగా వ్యవహరించడం సరికాదని ఈ సందర్భంగా సుమ విజ్ఞప్తి చేశారు.