బిర్యానీలో బొద్దింక..ఖంగుతిన్న వినియోగదారులు
* ఆదివారం మండపేటలో ఒక్కసారిగా ఖంగు తిన్న వినియోగదారులు
*ఎప్పుడో ఏడాదికోసారి చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోయే ఆహార తనిఖీ అధికారులు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం ఆగస్టు 27,(నిజం న్యూస్) బ్యూరో::
పేరున్న బిర్యానీనే కదాని కళ్లు మూసుకుని తింటే అంతే సంగతులు. బిర్యానీలో చికెన్ పీస్‌కు బదులు మరేదో జీవి పీస్‌ను తినాల్సి వస్తుంది.
ఆదివారం మండపేటలో ఒక వినియోగదారుడికి అదే పరిస్థితి ఎదురైంది. ప్యాకెట్ విప్పగానే అందులో బొద్దింకను చూసి ఖంగుతిన్న సదరు వినియోగదారుడు ఆయాసంతో కంగారుగా వచ్చి షాపు నిర్వాహకునితో గొడవపడి తన సొమ్ములు వాపస్ తీసుకుని వెళ్లిపోయాడు.
తాపేశ్వరానికి చెందిన యువకుడు ఆదివారం మధ్యాహ్నం మండపేట విజయామహల్ సమీపంలో పందలపాక అప్పారావు బిర్యానీగా పేరొందిన ఒక రెస్టారెంట్‌లో బిర్యాని కొనుగోలు చేశాడు.
బయటకు తీసుకెళ్లి తిందామనుకుని పార్శిల్ తెరిచే సరికి చికెన్ జాయింట్స్ మధ్యలో చనిపోయిన పెద్ద బొద్దింక కనిపించింది. అది కూడా శుభ్రంగా ఫ్రై చేయబడే ఉందనుకోండి! దీంతో ఎలా విప్పిన పార్శిల్ ను ఆలాగే కట్టేసి బిర్యాని పాయింట్ కు వెళ్ళి నిర్వాహకుడిని అడిగానని చెప్పాడు.
మా వాళ్ళు సరిగా చూసుకోలేదు ఇంకో పార్శిల్ ఇమ్మంటారా లేక డబ్బులు వాపసు ఇచ్చేయమంటారా అని అడిగ్గా, బొద్దింకల బిర్యానీ నాకొద్దు బాబోయ్ అంటూ డబ్బులు ఇచ్చేయండని తీసుకుని తిరిగి వచ్చేసినట్టు వినియోగదారుడు తెలిపాడు.
కాగా ఈ హోటల్లో చనిపోయిన కోళ్లతో వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు సైతం విన్పిస్తున్నాయి. తెల్లవారు జాము సమయంలో కోళ్ల ఫారాల వద్ద నుంచి తక్కువ ధరకు చనిపోయిన కోళ్లను తెచ్చి వంటల్లో వినియోగిస్తున్నారంటు న్నారు.
గతంలో రాజారత్న సెంటర్‌లో పేరొందిన టిఫిన్ సెంటర్ వద్ద సాంబారులో బల్లి ఉండటం అప్పట్లో సోషల్ మీడియాలో వైరలైంది. మండపేటలో ఫుడ్‌సేప్టీ అధికారుల తనిఖీలు కొరవరడంతో కొందరు వ్యాపారులకు ఇష్టారాజ్యంగా మారిందంటున్నారు స్థానికులు.
వీళ్లు చికెన్, మటన్‌లను రోజుల తరబడి ప్రీజర్లలో నిల్వ ఉంచి వాసన రాకుండా రకరకాల కెమికల్స్, ఫౌడర్లతో వండి వారుస్తున్నారంటు న్నారు.
ఎప్పుడో ఏడాదికి ఒకసారి కాకినాడ నుంచి ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీల పేరిట కాసేపు చుట్టం చూపుగా వచ్చి హడావిడి చేసి గుట్టుచప్పుడు కాకుండా మామూళ్లు దండుకునిపోవడం తప్ప కేసులు నమోదుచేయడం లేదని స్థానికులు అంటున్నారు.
ప్రజారోగ్యంతో చెలగాటమాడు తున్న వ్యాపారులపై చర్యలు తీసుకునే దిశగా ఉన్నతాధికారులు సమర్థవంతమైన కార్యాచరణ చేపట్టాలని మండపేట ప్రజలు కోరుతున్నారు.