Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కెసిఆర్ ను గద్దె దింపుదాం

● తెలంగాణ ఇచ్చింది ప్రజల కోసం..
● తెలంగాణ తెచ్చే శక్తి కెసిఆర్ కు ఎక్కడిది?
● బిఆర్ఎస్, బిజెపిలను తరిమికొట్టాలి
● చేవెళ్ల కాంగ్రెస్ ప్రజాగర్జన బహిరంగ సభలో ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లీఖార్జున ఖర్గే
● దళితులు, గిరిజనులను ఆదుకోవడానికే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్
● తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటన
● పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
● చేవెళ్ల ప్రజాగర్జన సభతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్
● డిక్లరేషన్‌తో ఎస్సీ, ఎస్టీలపై భారీగా వరాల జల్లు
చేవెళ్ల, ఆగస్టు 26(నిజం న్యూస్):
చేవెళ్ల మండల కేంద్రంలోని కెవిఆర్ గ్రౌండ్ లో శనివారం కాంగ్రెస్ ప్రజా గర్జన బహిరంగ సభ నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభలో 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

సభా ప్రాగంణమంతా అశేష జనవాహినితో కిక్కిరిసిపోయింది. పిసిసి రేవంత్ రెడ్డి సభా వేదిక పైన మాట్లాడుతుండగానే సభా ప్రాంగణంలో సీఎం సీఎ అంటూ నినాదాలు మారుమోగాయి.

ఎస్సీల చిరకాల డిమాండ్ ఏ,బి, సి,డి వర్గీకరణ అమలుకై కృషి చేస్తామని తెలిపారు. అంతకు ముందే వేదికపై దివంగత ప్రజానాయకుడు గద్దర్ చిత్రపటానికి ఖర్గే, రేవంత్, భట్టి, తదితరులు నివాళులు అర్పించారు.

పలువురు ఇతర పార్టీలకు చెందిన నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పోస్టర్ ను కాంగ్రెస్ నేతలతో కలిసి ఖార్గే విడుదల చేశారు.

కెసిఆర్ ను కలిసికట్టుగా ఏకమై గద్దె దింపుదామని ఖార్గే పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది ప్రజల కోసమేనని అన్నారు. తెలంగాణ తెచ్చే శక్తి కెసిఆర్ కు ఎక్కడిదని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ బిజెపిలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమన్నారు.

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కెసిఆర్ పాలనలో దళితులు గిరిజనులు మోసపోయారని అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం లో దళితులు గిరిజనులను ఆదుకునేందుకే తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తుందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 12 అంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్టరేషన్ ను అమలు చేస్తామన్నారు. మొదటి అంశంగా ఎస్సీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ ద్వారా జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్ 18 శాతానికి పెంపు చేస్తామని, ఎస్సీ రిజర్వేషన్లు ఏ బి సి డి వర్గీకరణ అమలుకై చర్యలు తీసుకుంటామని అన్నారు.

రెండవ అంశంగా అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో ఈ పథకం అమలు చేస్తామన్నారు.

మూడవ అంశంగా ప్రత్యేక రిలేషన్ రిజర్వేషన్లు ద్వారా ప్రభుత్వ ప్రోక్యూర్ మెంట్ మరియు అన్ని కాంట్రాక్టులలో ఎస్టీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

నాల్గవ అంశంగా ఇందిరమ్మ పక్క ఇళ్ల పథకంతో ఇల్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూపాయలు ఆరు లక్షలు అందజేస్తామన్నారు. ఐదేళ్లలో ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపజేస్తామన్నారు.

ఐదవ అంశంగా అసైన్డ్ భూముల పునరుద్ధరణ, సమాన హక్కుల ద్వారా బిఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములను తిరిగి అసైనీలకు అన్ని హక్కులతో పునరుద్ధరిస్తామన్నారు. ప్రజా ప్రయోజనార్థం భూ సేకరణ చట్టం 2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లిస్తామన్నారు.

ఆరవ అంశంగా కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి అర్హులైన అందరికీ పోడుపంటల పంపిణీ చేస్తామన్నారు.

ఏడవ అంశంగా సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా ప్రతి గూడెం, తండా గ్రామపంచాయతీలకు ఏటా రూపాయలు 25 లక్షలు కేటాయింపు చేస్తామన్నారు.

ఎనిమిదవ అంశంగా ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటుతో మాల, మాదిగ మరియు ఇతర ఎస్సీ ఉప కులాలకు కొత్తగా మూడు ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్కు 750 కోట్ల నిధులు మంజూరు చేస్తామన్నారు.

తొమ్మిదవ అంశంగా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా తుకారాం ఆదివాసి కార్పొరేషన్, సంతు సేవాలాల్ లంబాడా కార్పొరేషన్ మరియు ఎరుకల కార్పొరేషన్లను ఏర్పాటుచేసి, ప్రతి ఏడాదికి ఒక్కో కార్పొరేషన్ కు రూపాయలు 500 కోట్ల నిధులు మంజూరు చేస్తామన్నారు.

పదవ అంశంగా కొత్త ఐటీడీఏలు, 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను స్థాపిస్తామన్నారు. అందులో భాగంగానే మైదాన ప్రాంత ఎస్టీల కోసం నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ లలో కొత్త ఐటీడీఏలు ఏర్పాటు, అన్ని ఐటీడీఏ కేంద్రాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల స్థాపన చేస్తామన్నారు.

పదకొండవ అంశంగా విద్యా జ్యోతి పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదవ తరగతి పాసైతే పదివేల రూపాయలు, ఇంటర్ పాస్ అయితే పదిహేను వేల రూపాయలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూపాయలు లక్ష, ఎంఫిల్, పీహెచ్ డి పూర్తిచేసిన ఎస్సీ ఎస్టీ యువతకు ఐదు లక్షల రూపాయలు అందజేస్తామన్నారు.

పన్నెండవ అంశంగా రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్స్ మరియు విదేశాల్లో విద్య కింద ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ హాస్టల్ సదుపాయం కల్పిస్తామన్నారు. విదేశాల్లోని యూనివర్సిటీలో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సహాయం అంఋదజేస్తామన్నారు.

తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వస్తే డిక్లరేషన్‌లో ప్రకటించిన 12 హామీలను అమలు ఖచ్చితంగా అమలుచేస్తామని ప్రకటించారు.

చేవెళ్ల నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న సున్నపు వసంతం, భీమ్ భరత్, షాబాద్ దర్శన్ సభా వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యతను వివరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అశేషంగా పాల్గొన్నారు.