Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కోదాడలో అసమ్మతా … అక్కసా …!

– ముగ్గురు ఆశావహుల్లో ఎవరి దారి వారిదే…

– ఐక్యతతో ఒకరి పేరు మరొకరు చెప్పలేని దుస్థితి…

– నిన్నటి వరకు నాకే టిక్కెట్ అంటూ వ్యక్తిగత ప్రచారం

– ఓ పెద్దాయన నియోజకవర్గ నాయకులకు ఫోన్లు – ఆలయంలో పూజలు..

– మరొకరేమో గోడల మీద రాతలు…

– ఎర్నేని మాత్రమే కన్మంతరెడ్డికి మద్దతు ….

– గురువిందలా ఎమ్మెల్యేపై వ్యక్తిగత అసత్య ఆరోపణలు …

– 2014లో బొల్లంకు వెన్నుపోటు పొడిచిందెవరో ప్రజలందరికీ తెలుసు…

– విమర్శలు పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే బొల్లం….

– మరోసారి గెలిపించేందుకు సబ్బండ వర్గాల సంసిద్దత

హైదరాబాద్, ఆగస్టు 26, నిజం చెబుతాం:

స్వంత గడ్డపై మమకారంతో 2007లో రాజకీయ ఆరంగేట్రం చేసిన బొల్లం మల్లయ్య యాదవ్ గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలతో అనుబంధాన్ని పెంచుకొని, కుటుంబ సభ్యుడిగా కష్టనష్టాల్లో భాగస్వామ్యం అవుతూ మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే.

అందుకు ప్రతిఫలంగా మెజార్టీ ప్రజల అభిప్రాయ సేకరణతో నియోజకవర్గంలో 85% దళిత బహుజనుల ప్రతినిధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపితే ప్రజలు మద్దతిచ్చి గెలిపించారు.

అప్పటి నుంచి 24/7 ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా వారి ముంగిటికే వెళ్ళి అందజేయడంతో పలు సర్వేలను అనుసరించి తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఎమ్మెల్యేగా బొల్లం మల్లయ్య యాదవ్ గెలిచి పట్టుమని 10 నెలలు ముగియకముందే ఆయన ఎదుగుదలను ఓర్వలేక రాజకీయ కురువృద్ధుడు పెద్దాయనతో పాటు మరికొందరు అసమ్మతి పేరుతో అక్కసు వెళ్లగకుతూ వ్యక్తిగత ప్రతిష్టను దిగదా ర్చేందుకు చేస్తున్న ప్రయత్నం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ఆకాంక్షల మేరకు ప్రాధాన్యతా క్రమంలో అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడుతూ తమను బేఖాతర్ చేయడం లేదని, గౌరవించడం లేదని వారే దూరమై ఇప్పుడు ఎమ్మెల్యే తమని పట్టించుకోవడం లేదని అసమ్మతి రాగాలు వినిపించడం వారి ఆధిపత్య భావజాలాన్ని స్పష్టం చేస్తుందంటున్నారు.

రెండోసారి టిక్కెట్ ఖరారు చేసినందుకు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే వీరు మాత్రం అసమ్మతి పేరుతో అక్కసు వెళ్లగక్కడం సమంజసం కాదంటున్నారు.

పోనీ ముగ్గురు ఆశావహుల్లో ఒకరిపై మరొకరు నమ్మకం ఉందా అంటే అదీ లేదు, నిన్నటి వరకు అధిష్టానం తనకే టిక్కెట్ ఖరారు చేసిందని గోండ్రియాల దేవాలయంలో పూజలు నిర్వహించి పలువురి నాయకులకు ఫోన్లు చేసి మద్దతివ్వాలన్నది వాస్తవం కాదా అని ప్రశ్నిస్తుండగా, మరో యువ నేత ఇప్పటికే నాకే టిక్కెట్ అంటూ గోడలపై రాతలు రాయించగా, బీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్ చార్జ్ తనకే టిక్కెట్ వస్తుందని ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.

ఆయనకు చోటా మోటా నాయకులతో పాటు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారని రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని మాత్రమే మద్దతు పలికారు..

ఆశావహుల్లో సమిష్టిగా ఒక్క పేరును సూచించలేని పరిస్థితుల్లో అధిష్టానం వారి అక్కసును పరిగణలోకి తీసుకునే దాఖలాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు సహజమేనని, అయితే తాము ఎమ్మెల్యే కాకముందు, ఆ తర్వాత ఆస్తులు ఏ స్థాయిలో పెరిగాయో ప్రజలకు తెలుసునని, 10 ఎకరాల నుచి 300 ఎకరాలకు పైగా ఆస్తులను చెమటోడ్చి సంపాదించారా అనే విషయం ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందని ఆరోపణలు చేయటం గురివింద చందంగా ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈర్ష తప్ప మరేమీ లేదు…

ఒకరిపై ఆరోపణలు చేసేటప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలంటున్నారు. ఎమ్మెల్యే బొల్లం మరోసారి గెలిస్తే రాజకీయంగా మరింత ఎదుగుతారనే ఈర్శ్య తప్ప మరేం లేదని, తమ ఉనికి ప్రశ్నార్థమవుతుందనే ఆలోచనతోనే ఆరోపణలు చేస్తున్నారని భావిస్తున్నారు. తమ అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయంగా, ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించడం సరైంది కాదంటున్నారు.

10 సంవత్సరాల క్రితమే అధిష్టానాలు ప్రస్తుత రాజకీయాలకు సరికావని 2014లో అప్పటి టీడీపీ అధిష్టానం పెద్దాయననుకాదని ఎమ్మెల్యే బొల్లంను ఎన్నికల బరిలో నిలిపితే వెన్నుపోటు పొడిచిందెవరో ఇప్పటికీ ప్రజలు మరువలేదనే విషయం గుర్తుచేసుకోవాలన్నారు.

ద్వితీయ శ్రేణిని ఎదగనీయని సీనియర్ నాయకుడు…

ఆ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో ద్వితీయ శ్రేణి నాయకులెవరినీ ఎదగనివ్వని మాట వాస్తవం కాదా!, దాసిరెడ్డి, చంద్రమౌళి, పాలేటి నాగేశ్వరరావు, జెట్టి వెంకటరెడ్డి, పాండురంగారావు, పార సీతయ్యలను పొమ్మనలేక పొగపెట్టి రాజకీయంగా ఎదగనివ్వని మాట వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు.

గత ఎన్నికల్లో శశిధర్ రెడ్డికి టికెట్ రాకుండా మోకాలు వడ్డింది ఎవరు అన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే.

ఇప్పటికీ వీరిలో ఇద్దరు తప్ప మిగిలినవారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. వారిని అడిగితే ద్వితీయ శ్రేణి నాయకులపై ఏ పార్టీ గౌరవం ఉందో బట్టబయలవుతుందని చెబుతున్నారు.

తన పదవీకాలం ముగియక ముందే పెద్దాయనపై ఆరోపణలు చేసి 6 నెలలకు ముందే కోదాడ ఎంపీపీ పదవికి పాండురంగారావు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

ఒకటిన్నర సంవత్సరం నుంచి బీఆర్ ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిలు తనకు సహకరించడం లేదని ప్రత్యక్షంగానే దుర్భాషలాడుతూ, ఆ పార్టీతో తనకే సంబంధం లేదని వ్యాఖ్యానించిన డీసీసీబీ మాజీ అధ్యక్షుడిని విలేకర్ల సమావేశంలో అధినాయకులను తిట్టించిన విషయం తెలిసిందే. ఇదేనా అధినాయకులపై మీకున్న అభిమానం అని నిబద్దత గల పార్టీ శ్రేణులు నిలదీస్తున్నారు.

తన పని తాను చేసుకు పోతున్న ఎమ్మెల్యే…

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాత్రం అసమ్మతిని, అక్కసును పట్టించుకోకుండా సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

అసమ్మతి అంశంపై అధిష్టానం, ప్రజలే చూసుకుంటారని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమం, వ్యక్తిగతంగా ప్రజల్లో తనకున్న ఆదరాభిమానాలే రెండోసారి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ముందుకు సాగుతున్నారు.