Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇకపై ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు 

నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంలో పలు సంస్కరనలకు శ్రీకారం చుట్టింది.

నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా కేంద్రం విద్యావ్యవస్థలో పలు కీలక మార్పులకు సిద్ధమైంది.

బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించేలా కొత్త కరికులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్ర విద్యాశాఖ రూపొందించింది.

ఈ ఫ్రేంవర్క్ గనక అనుమతి పొందితే విద్యార్థులు ఇకపై ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు రాయడంతో పాటుగా ఆయా సబ్జెక్ట్‌లలో సాధించిన ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం కలుగుతుంది.

ఇలా ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గడంతో పాటుగా వారు మెరుగైన స్కోరు సాధించడానికి అవకాశం లభిస్తుందని విద్యాశాఖ తెలిపింది.

కరోనా సమయంలో సి బి ఎస్ సి తో పాటు పలు రాష్ట్ర విద్యాశాఖలు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి మంచి ఫలితాలను సాధించాయని విద్యాశాఖ తెలియజేసింది.

ఒక్కొక్క అర్ధ సంవత్సరంలో 50 % సిలబస్ మాత్రమే వుంటుంది. కాబట్టి ఫైనల్ పరీక్షలకు మొత్తం సిలబస్ చదివే అవసరం వుండదు.

అట్లే ఈ ప్రణాళికలో భాగంగా ఇంటర్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరాలలో (సెంట్రల్ సిలబస్ లో 11, 12 తరగతులు) విద్యార్థులు రెండు లాంగ్వేజిలను కచ్చితంగా అభ్యసించాలని, వాటిలో ఒకటి భారతీయ భాష అయి ఉండాలని కూడా విద్యాశాఖ ప్రస్తుత ప్రణాళికలో ప్రతిపాదించింది.

ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు పరీక్షలకు తయారయ్యేందుకు తగినంత సమయం దొరకడంతో పాటుగా మంచి పనితీరును కనబరిచేందుకు వీలుగా కొత్త పాఠ్య ప్రణాళికను రూపొందించనున్నారు.

ప్రశ్నల ఎంపిక కూడా ఆయా సబ్జెక్టులలో విద్యార్ధులకు ఎంత అవగాహన వుంటుందనే దానిపైనే ఆధారపడి రూపొందిస్తారు.

ఇందువలన విద్యార్ధులు వివిధ సబ్జెక్టులలో పాఠ్యాంశాలను క్షుణంగా అధ్యయనం చేసుకోవాల్సి వుంటుంది తద్వారా బట్టి చదువుల విధానానికి తెర దించే విధంగా విధానాన్ని రూపొందిస్తున్నారు.

విద్యార్థులు నెలల తరబడి కోచింగ్‌, బట్టీపట్టడం వంటి వాటికి పూర్తి వ్యతిరేకంగా ఈ నూతన పరీక్షల విధానం ఉంటుందని తెలిపింది.

పూర్తిగా పట్టు సాధించిన సబ్జెక్టులను ముందుగా బోర్డు పరీక్షల్లో రాసుకోవచ్చని, అలాగే బెస్ట్‌ మార్కులను ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది.

9, 10 తరగతుల విద్యార్థులు ఇకపై కచ్చితంగా మూడు లాంగ్వేజ్‌ సబ్జెక్టులు చదవడం తప్పనిసరని ఎస్‌సీఎఫ్‌ సిఫార్సు చేసింది.

వీరు మూడు లాంగ్వేజ్‌లతోపాటు మ్యాథ్స్, కంప్యూటేషనల్‌ థింకింగ్, సోషల్‌ సైన్స్, సైన్స్, ఆర్ట్‌ ఎడ్యుకేషన్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, వెల్‌–బీయింగ్, వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ లాంటి వాటి నుంచి ఏడు సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది.

ఇంటర్‌ విద్యార్ధులకు సబ్జెక్టుల ఎంపికపై పూర్తి స్వేచ్చ ఇకపై లభించనున్నాది. అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా సబ్జెక్టుల ఎంపిక చేసుకోవచ్చు.

సబ్జెక్టులపై పూర్తి అవగాహన, ప్రాక్టికల్స్‌ నైపుణ్యాలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా నూతన పాఠ్యప్రణాళిక రూపకల్పన చేశారు

(కధనం: ప్రతాప్)