Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనలో దేశానికే ఎపి ఆదర్శం

గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఇటీవల నంద్యాలజిల్లాలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఈ ప్రాజెక్టులను నెలకొల్పడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ హెచ్ పి తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎనిమిది వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని..గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసే విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు సీఎం జగన్.

రైతులకు నిరంతరాయంగా సరఫరా చేసే ఉచిత విద్యుత్‌కు ఆతంకం ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సోలార్, పవన్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో పలు కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.

ప్రతి మెగావాట్‌ ఉత్పత్తికి ఆ ప్రాజెక్టుల లైఫ్‌ ఉన్నంతకాలం రాయల్టీ కింద రూ.1లక్ష చొప్పున వస్తుంది. జీఎస్టీ ఆదాయం కూడా ప్రభుత్వానికి వస్తుంది.

సహకారం అందిస్తున్న రైతులకు, రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటూ ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.30వేలు లీజు చొప్పున వస్తుంది. ప్రతి రెండేళ్లకు 5శాతం లీజు రుసుము పెరుగుతుందని, తద్వారా ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకూ మంచి జరుగుతుందని ప్రభుత్వం వివరించింది.

పంప్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తు తరాలకు గ్రీన్‌ ఎనర్జీ అందుతుంది. కాలుష్య కారక విద్యుత్‌పై ఆధారపడే పరిస్థితి క్రమేణా తగ్గుతుంది. భవిష్యత్తులో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి. వీటికి అనుబంధంగా సోలార్‌, విండ్‌ ప్రాజెక్టులు అనుసంధానం అవుతున్న తీరు గ్రీన్‌ ఎనర్జీలో విప్లవానికి దారితీస్తాయి.

ఔక మండలం జునూతల గ్రామంలో గ్రీన్‌కో గ్రూపు ఏర్పాటు చేయనున్న 2,300 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు, పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామంలో ఏఎం గ్రీన్ ఎనర్జీ ద్వారా 700 మెగావాట్ల సోలార్, 314 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లకు శంకుస్థాపన జరిగింది.

ఈ ప్రణాళికలో భాగంగా బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామంలో ఎకోరెన్‌ ఎనర్జీ ద్వారా 1,000 మెగావాట్ల సోలార్‌, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఇంధన శాఖ, ఏపీజెన్‌కో పునరుత్పాధక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి సారించాయి.

ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ ఏపీజెన్‌కో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ -ఎన్‌హెచ్‌పీసీ పంప్డ్‌ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణంపై అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ రంగంలో 81వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు పచ్చజెండా ఊపింది.

ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. గ్రీన్‌ ఎనర్జీలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది..

(కథనం: ప్రతాప్)