Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యాంటీ బయోటిక్స్ వినియోగం పట్ల తస్మాత్ జాగ్రత్త 

కంటికి కనిపించని బ్యాక్టీరియాలు సృష్టిలోని ఎన్నో జీవులను కాలగర్భంలో కలిపేస్తున్నాయి. అంతు చిక్కని వ్యాధులను తెచ్చిపెడుతూ మానవ మనగడకే సవాలుగా మారుతున్నాయి.

ఆధునిక వైద్య విధానాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా అంతే వేగంగా తమ రూపాలను మార్చుకొంటూ సామర్థ్యాన్ని పెంచుకొంటున్నాయి.అయితే కరోనా తర్వాత శరవేగంతో రూపాంతరం చెందుతూ, కొత్త వేరియంట్లను సృష్టిస్తూ తద్వారా వినియోగంలో వున్న యాంటీ బయోటెక్ మందులకు పెను సవాలు విసురుతున్న బ్యాక్టీరియాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాలకు హెచ్చరికలు చేసింది.

కాగా సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) ఇటీవల చెసిన ఒక అధ్యయనంలో ఆధునిక వైద్య విధానాలు, మందులు, వైరస్ లను సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు ఎన్ని కొత్త మందులు మార్కెట్ లోకి వస్తున్నా అంతే వేగంగా తమ రూపాలను మార్చుకొంటూ సామర్థ్యాన్ని పెంచుకొంటున్నాయి

తద్వారా జీవకణాలపై వాటి దాడిని యాంటీ బయాటిక్స్‌ సమర్థంగా నిలువరించలేకపోతున్నట్టు తెలిపింది.

అనేక రకాల బ్యాక్టీరియా యాంటీబయోటిక్స్‌ను తట్టుకునే సామర్థ్యం సంతరించుకోవటంతో.. ఆ మొండి బ్యాక్టీరియాల వల్ల వచ్చే అంటువ్యాధుల కారణంగా 2019లో ప్రపంచ వ్యాప్తంగా 12లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని లాన్సెట్ తాజా అధ్యయన నివేదిక ఇటీవల వెల్లడించింది.

మలేరియా, ఎయిడ్స్ వ్యాధుల వల్ల సంభవించే వార్షిక మరణాల సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ అని గణాంకాలు తెలియజేస్తున్నాయి.

చిన్నచిన్న ఇన్ఫెక్షన్లకూ యాంటిబయోటిక్స్‌ వాడటం ఇటీవలి సంవత్సరాల్లో ఎక్కువయింది. దీనివల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ల‌ మీద అవి చూపే ప్రభావం తగ్గిపోతోంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్లు తగ్గటం లేదు అని సదరు నివేదిక కుండ బద్దలు కొట్టింది.

యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్‌ఆర్) అనేది రహస్య మహమ్మారి అని బ్రిటన్ ఆరోగ్యశాఖ ఇటీవల హెచ్చరించింది. యాంటీబయాటిక్స్‌ వాడాలని సిఫారసు చేసేటపుడు బాధ్యతాయుతంగా లేకపోతే.. కోవిడ్ వల్ల ఈ ఏఎమ్ఆర్ పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తంచేసింది.

యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్‌ను ఎదుర్కొనే పోరులో ముందంజలో ఉండాలంటే.. తక్షణమే చర్యలు చేపట్టటం అత్యవసరమని ఈ అధ్యయనం స్పష్టంచేస్తోంది.

అయితే వివిధ దేశాలు, ప్రాంతాల్లో డ్రగ్ రెసిస్టెన్స్ స్థాయిలను పరిశీలించటం అవసరమని ఇతర నిపుణులు అంటున్నారు.

(కధనం: ప్రతాప్)