Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తిరగబడదాం.. తరిమికొడదాం..కాంగ్రెస్ సరికొత్త నినాదం

తిరగబడదాం.. తరిమికొడదాం’ అనే సరికొత్త నినాదంతో

ఈ నెల 26వ తేదీన సాయంత్రం 4 గంటలకు చేవెళ్లలో ‘ప్రజా గర్జన సభ’ ను నిర్వహించాలని తెలంగాణా కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నినాదాన్ని గ్రామ స్థాయిలో ప్రజలలో బలంగా నాటుకునేందుకు చేవెళ్ళతో సహా పలు కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల ప్రజా గర్జనకు ముఖ్య అతిథిగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని, ఈ బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఖర్గే విడుదల చేస్తారని చెప్పారు.

పిసిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో భాగంగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో పిసిసి ఉపాధ్యక్షుడు కో ఆర్డినేటర్లుగా ఉంటారు.

ఈ నెల 29వ తేదీన మైనార్టీ డిక్లరేషన్‌ను వరంగల్‌లో విడుదల చేస్తారు.సెప్టెంబర్ 6వ తేదీ లేదా 9వ తేదీన ఓబిసి డిక్లరేషన్ ను ఒక భారీ బహిరంగ సభలో కర్ణాటక సిఎం సిద్ధరామయ్య విడుదల చేస్తారు.

మరొక ముఖ్య కార్యక్రమంలో కర్ణాటక తరహాలో కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ చేరేలా ఒక కార్యక్రమం సిద్ధం చేసారు. సెప్టెంబర్ 17వ తేదీన కాంగ్రెస్ మ్యానిఫెస్టోను సోనియాగాంధీ చేతుల మీదుగా విడుదల చేయించాలని పిసిసి ఒక కార్యక్రమం నిర్ణయించింది.

తిరగబడదాం..తరిమికొడదాం కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని..ప్రతీ గడపకు చేరాలి…ప్రతీ తలుపు తట్టేలా చూడాలి, ఇందుకోసం పార్లమెంట్ వారీగా కోఆర్డినెటర్లను పిసిసి నియమించింది. ప్రతీ ఇంటికీ కాంగ్రెస్ హామీలు చేరాలన్నదే పిసిసి లక్ష్యంగా నిర్ణయించుకుంది.

మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించే సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీని ఆహ్వానించింది.

పార్టీ మేనిఫెస్టో విడుదలకు సోనియా గాంధీని ఆహ్వానించేందుకు, ఈ నేపథ్యంలోనే ఖర్గేతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై చర్చించేందుకు పార్టీ నేతలతో కలసి మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌ ఆదివారం ఢిల్లీ వెళ్లబోతున్నారు అని సమాచారం.

‘‘ప్రజల్లో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణను చూసే కేసీఆర్‌ మళ్లీ ప్రజల్ని మోసగించేసేందుకు పథకాలను తెరమీదకు తెస్తున్నారు.

రుణమాఫీ, బీసీ బంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మి పథకాలు ఇప్పుడేందుకు తెచ్చారో ప్రజలందరికీ అర్థమవుతోంది’’ అని అని పీసీసీ ప్రచార కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

(కధనం: ప్రతాప్)