Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఫోటోగ్రఫీలో అంతర్జాతీయ స్థాయి పురస్కారం

ఖమ్మం బ్యూరో ఆగష్టు 19(నిజం చెపుతాం): ఖమ్మానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ చావా సంపత్ కుమార్ కు అంతర్జాతీయ స్థాయిలో అమెరికాకు చెందిన ఐ సి యస్ సంస్థ ఫోటోగ్రఫీలో మాస్టర్స్ ని విజయవాడ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానం చేసింది.

184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ బాలోత్సవ్ లో జరిగిన కార్యక్రమంలో సంపత్ కుమార్ కు అంతర్జాతీయ స్థాయి పురస్కారం బహూకరించారు. ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్ మరియు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.

సంపత్ కుమార్ ఉత్తరప్రదేశ్ కుంభమేళాలో తీసిన నాగసాధువులు, అఘోరాలకు సంబంధించి తీసిన చిత్రాలకు అంతర్జాతీయ పురస్కారాన్ని ఐసీఎస్ సంస్థ ప్రకటించింది.భారతదేశం నుంచి ఫోటోగ్రఫీలో మాస్టర్స్ అందుకున్న అతి కొద్ది మందిలో ఖమ్మం జిల్లాకు చెందిన సంపత్ కుమార్ కూడా ఒకరు కావడం గర్వకారణం.
77వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంపత్ తీసిన ‘లవ్ నేషన్- లవ్ పీపుల్’ చిత్రానికి జాతీయస్థాయి అవార్డు దక్కింది.

ఈ సందర్భంగా సంపత్ కుమార్ కు జాతీయస్థాయి ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు సైతం అందజేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంపత్ కుమార్ ను పలువురు అభినందించారు.

బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో న్యూఢిల్లీ నేషనల్ మెడికల్ కమీషన్ డైరెక్టర్ డాక్టర్ జిబి రావు, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె హేమ చంద్రారెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, గోళ్ళ నారాయణరావు, వెంకటరమణ నరేంద్ర శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.