Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలుగు రాష్ట్రాలకు రైల్వే శాఖ తీపి కబురు

పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని, దేశంలోని కీలక మార్గాల్లో రైల్వే లైన్ బబ్లింగ్ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్ద వాటానే దక్కడం ఒక మంచి పరిణామం.

తాజా నిర్ణయంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు వంటి నగరాల మధ్య ప్రయాణ దూరం తగ్గడమే కాకుండా, ప్రయాణ సదుపాయం మరింత మెరుగుపడనుంది అని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.

దేశవ్యాప్తంగా రూ.32,500 కోట్లతో తొమ్మిది రాష్ట్రాల్లోని 35 జిల్లాల్లో రైల్వే లైన్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో చిరకాలంగా పెండింగ్ లో వున్న పలు రైల్వే ప్రోజెక్టులకు కేంద్ర క్యాబినెట్ అమోద ముద్ర వేయడం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చెస్తున్నారు.

ప్రధాన మంత్రి గతిశక్తి ప్రణాళికలో భాగంగా రైళ్ల రాకపోకల క్రమబద్ధీకరణతో పాటు రద్దీని తగ్గించడం కోసం గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్‌- డోన్‌ మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్‌ పనులకు అమోదం తెలిపింది.

వీటితో పాటు దేశంలో ఏడు రైల్వే మల్టీట్రాకింగ్‌ ప్రాజెక్టు పనులకు కేంద్రం అమోద ముద్ర వేసింది.ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని రైల్వే శాఖ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్‌- కర్నూలు జిల్లా డోన్‌ మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్‌ ప్రాజెక్టులకు మొత్తం రూ.7,539.32 కోట్లు కేటాయించింది.

ఏపీలో వివిధ రూట్లలో 374.91 కి.మీ మేర నూతన రైల్వే లైన్లు నిర్మితం కానుండగా తెలంగాణలో వివిధ రూట్లలో 433.82 కి.మీ మేర నిర్మితం కానున్నాయి.

గుంటూరు – బీబీనగర్‌ మధ్య 239 కి.మీ. మార్గాన్ని రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు రూ.2,853.23 కోట్లు కేటాయించారు.

గుంటూరు – బీబీనగర్‌ మధ్య రైల్వే లైన్‌ డబ్లింగ్‌తో గుంటూరు, పల్నాడు ప్రాంతాలను ఒడిశా, ఇటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలతో అనుసంధానిస్తుంది.

అంతేకాకుండా గుంటూరు- సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గాన్ని కూడా అందుబాటులోకి వస్తుంది.

ఈ ప్రాజెక్టు వల్ల చెన్నై-హైదరాబాద్‌ మధ్య 76 కిలోమీటర్లు, విజయవాడ-సికింద్రాబాద్‌ మధ్య 38 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది.

ప్రస్తుతం గుంటూరు-విజయవాడ-కాజీపేట- సికింద్రాబాద్‌ మార్గం రద్దీగా మారడంతో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి.

దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ ప్రయాణ దూరంతో గుంటూరు- సికింద్రాబాద్‌ లైన్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాంతం మీదుగా ఇనుము, సిమెంట్, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తుల రవాణాకు ఉపయోగపడుతుంది.

ముద్ఖేడ్‌ – డోన్‌ మధ్య 417.88 కి.మీ. మేర డబ్లింగ్‌ పనులకు రూ.4,686.09 కోట్లు ఖర్చు చేస్తారు.

ఈ పనులు పూర్తయితే ఈ లైన్లలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంతోపాటు గూడ్స్‌ రైళ్ల ద్వారా సరుకు రవాణాకు వీలవుతుంది.

డబ్లింగ్‌ పనులు పూర్తైతే ఈ మార్గాల్లో పారిశ్రామిక, వ్యవసాయోత్పత్తుల వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది..

భద్రక్‌-విజయనగరం సెక్షన్‌లోని ఖుర్దా రోడ్‌-విజయనగరం మధ్య 363 కిలోమీటర్ల మేర మూడో లైన్‌ నిర్మాణానికి రూ.5,618 కోట్లకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. తొలుత సికింద్రాబాద్- విశాఖపట్టణం వందే భారత్ ట్రైన్ తర్వాత సికింద్రాబాద్- తిరుపతికి కూడా ఒక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం అయ్యింది.

తెలంగాణలోని హైదరాబాద్‌ను.. కర్ణాటకను కలిపే కాచిగూడ- యశ్వంత్‌పుర్ రూట్‌లో ఒకటి.. చెన్నై- విజయవాడ రూట్‌లో రెందవది , మొత్తం రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ సూచనప్రాయంగా తెలిపింది.

(కధనం: ప్రతాప్)