Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు

కేంద్ర ప్రభుత్వం తాజాగా విద్యుత్తు చట్టం-2003కు పలు సవరణలు చేస్తూ సిద్ధం చేసిన విద్యుత్తు సవరణల బిల్లు-2022ను విపక్ష పాలిత రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.

వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడం, డిస్కంలను ప్రైవేటీకరించడం, క్రాస్‌ సబ్సిడీని ఎత్తివేయడం. లాంటి అనేక వివాదాస్పద అంశాలతో కూడిన విద్యుత్తు సవరణల బిల్లు-2022ను కె సి ఆర్ ప్రభుత్వం సైతం ఆది నుండి వ్యతిరేకించదమే కాకుండా రాష్ట్ర శాసనసభలోనూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది.

అయితే తాజాగా ఇదే అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పై బిల్లుపై ఏర్పడిన పార్లమెంటరీ కమిటీకి పంపినట్టు సమాచారం.

విద్యుత్తు సవరణల బిల్లు-2022పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడం, విద్యుత్తు సంస్థల కార్మికులు, ఉద్యోగులు, ఇంజినీర్లు సమ్మెకు దిగడం, నిరసనలు వెల్లువెత్తడంతో.. బిల్లును పార్లమెంటరీ కమిటీకి నివేదించారన్న సంగతి విదితమే .

ఈ నేపథ్యంలోనే పార్లమెంటరీ కమిటీ అన్ని రాష్ర్టాల అభిప్రాయాలను సేకరిస్తున్నది.

వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని, డిస్కంలను ప్రైవేటీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం మరోసారి కేంద్రానికి స్పష్టం చేయనుంది.

విద్యుత్తుపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ ముందు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు జరగబోయే సమావేశం లో స్పష్టం చేయనున్నదని సమాచారం.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అన్ని జిల్లాల్లోని వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని అధికారులను ఆదేశించారు.మీటర్లు వల్ల ఒనగూరే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేపట్టాలి..

రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు దీనిపై పూర్తిస్థాయి అవగాహన కలిగించాలని జగన్‌ గతంలో అధికారులను ఆదేశించారు.

ఇదే అభిప్రాయాన్ని పార్లమెంటరీ సంఘం ముందు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు స్పష్టం చేయనున్నారని సమాచారం.

(ప్రత్యేక కధనం: ప్రతాప్)