Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అవయవ దానంలో తెలంగాణా నెం. 1

అవయవదానం పట్ల మానవాళిలో అనూహ్యమైన చైతన్యం వస్తోంది. తమ జీవితం తర్వాత తమ అవయవాల ద్వారా ఇతరులకు ప్రాణం నింపి వారికి కొత్త జీవితం ఇవ్వాలన్న స్పృహ సమాజంలో నానాటికీ పెరుగుతూ వస్తోంది.

ఈ విషయంలో తెలంగాణా ప్రజలు మిగితా దేశం కంటే ముందుండడం మనందరికీ గర్వకారణం.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2022 సంవత్సరంలో తెలంగాణలో 194 మంది అవయవ దానం చేయగా, దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. తమిళనాడు, కర్నాటక, గుజరాత్ తర్వాతి స్ధానాల్లో నిలిచాయి.

అవయవదానం ప్రక్రియలో అవకతవకలను తొలగించి సమర్ధవంత నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా 2013 వ సంవత్సరంలో జీవన్‌దాన్ కార్యక్రమం ప్రారంభం చేసింది.

ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 1288 బ్రెయిన్ డెత్ డొనేషన్స్ జరగగా, మొత్తం 4829 అవయవాలను సేకరించి, అవసరం ఉన్న వారికి అమర్చడం జరిగింది.

2022లో దేశవ్యాప్తంగా 1675 ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు జరిగితే ఒక్క తెలంగాణలోనే 530 జరిగాయి. తెలంగాణా రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఖరీదైన ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నాయి.

పేదలకు ప్రభుత్వ ఖర్చుతో అవయవ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తు ప్రభుత్వ డాక్టర్లు వారికి జీవం పోస్తున్నారు.

ఉదాహరణకు జూన్ నెలలో నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స జరగగా, నిమ్స్ వైద్యులు ఒకే రోజు రెండుమూడు అవయవ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

దీనితో యావత్ దేశం ఇప్పుడు తెలంగాణా వైపు చూసే పరిస్థితులు వచ్చాయి.

అవయవదానం విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా దేశంలో తొలిసారిగా తెలంగాణ ఆన్లైన్ పోర్టల్ ను ప్రారంభించింది.

కేంద్ర ప్రభుత్వం సహా మహరాష్ట్ర,దిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు మన ఈ విధానాన్ని అనుసరించడం ప్రారంభించాయి.

అవయవదానంపై మన సమాజంలో ఎన్నో అపోహలు రాజ్యమేలుతున్నాయి. కానీ మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవే అవయవాలు మరెందరి ప్రాణాలు నిలబెడతాయి.

అలా కాదని ఖననం చేస్తే విలువైన అవయవాలు వృథాగా మట్టిలో కలిసిపోతాయి.

దహనం చేస్తే కాలిపోతాయి. మట్టిలో కలవడం కంటే… కాలడం కంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని ప్రతివారిలోనూ అవగాహన కలిగినప్పుడు మరెందరో అవయవార్థులు జీవం పుంజుకొని సమాజంలో తమవంతు బాధ్యతలను పోషిస్తారు.