Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భారీగా పెరగనున్న మెడికల్ సీట్లు

వైద్య విద్య అభ్యసించాలనుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం మరొక తీపి కబురు అందించింది.

తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను తెలంగాణా ముఖ్యమంత్రి వచ్చే నెలలో ప్రారంభించనున్నారు.

ఒకే వేదికపై సీఎం వీటిని ప్రారంభిస్తారని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఆసిఫాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్‌, జనగాం, సిరిసిల్ల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో ఈ కాలేజీలు ఏర్పాటయ్యాయి.

ఒక్కో కాలేజీలో వంద ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే కాళోజీ హెల్త్‌యూనివర్సిటీ ఈ ఏడాది వైద్యవిద్య అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది.

నీట్ అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ సీట్ల భర్తీ ప్రక్రియ జరుగుతుందని కాళోజీ హెల్త్ యునివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.

2022 ఆగష్టు లో రాష్ట్రంలో మెడికల్ సీట్లు 2890 వుండేవి తాజాగా అందుబాటులోకి రానున్న తొమ్మిది కాలేజీలతో మరో 900 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ వైద్యవిద్య కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 3790 కు పెరిగింది.

కాగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం వచ్చిన ధరకాస్తుల పరిశీలన కార్యక్రమం జరుగుతోందని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి కొత్త కాలేజీల ఏర్పాటు నోటిఫికేషన్ వస్తుందని సమాచారం.

దానితో కనీసం రెండు వేల సీట్లు అదనంగా వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రతీ లక్ష జనాభా ప్రాతిపదికపై దేశంలోనే మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణా రాష్ట్రం ప్రధమ స్థానంలో వుంది.

పి జి మెడికల్ సీట్ల పెంపు విషయంలో కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.

జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం కానున్నట్లు పేర్కొన్నారు.సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనంలో రాష్ట్రంలో వైద్య విద్య విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.

2014కు ముందు రాష్ట్రంలో 5 మెడికల్‌ కాలేజీలు ఉంటే, ఇప్పటికే 17కు పెరిగిందని గుర్తు చేశారు. ఈ ఏడాదితో ఆ సంఖ్య 26కు చేరబోతున్నదని చెప్పారు.

(సి.హెచ్.ప్రతాప్)