Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాష్ట్రంలో కొత్తగా రెండు JNTU ఇంజనీరింగ్ కళాశాలలు

రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య సామాన్యులకు సైతం చేరువ చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇంజనీరింగ్ కాలేజీల స్థాపనకు కృషి చేస్తోంది.

ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్‌లో జెఎన్‌టియు కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం తాజాకా పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది.

ఈ కొత్త కాలేజీల్లో ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రవేశాలు కల్పించనున్నారు. బి.టెక్‌లో ఐదు కోర్సులతో జెఎన్‌టియు కాలేజీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సిఎస్‌ఇ, డేటా సైన్స్, ఇసిఇ, ఇఇఇ, మెకానికల్ కోర్సులతో కొత్త కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున కేటాయించారు.

త్వరలో ఎంసెట్ ప్రత్యేక విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుండగా, ఆ కౌన్సిలింగ్‌లో ఈ కాలేజీలోని సీట్లను భర్తీ చేస్తారు.ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రత్యేక విడతలో మొత్తం 19,049 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఖమ్మం నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో జేఎన్టీయూ ఏర్పాటుకు ఇప్పటికే స్థలాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదే కళాశాల ప్రారంభం కానుండగా, ప్రత్యేక కౌన్సెలింగ్‌ ద్వారా అడ్మిషన్లు కల్పించనున్నారు.రాష్ట్రంలో మరిన్ని ఇంజనీరింగ్ కాలేజీల స్థాపనకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది.

ఎంసెట్‌ స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌లో వీటిల్లో సీట్లను భర్తీ చేస్తారు. వనపర్తి, సిరిసిల్ల, మానుకోట, పాలేరు కాలేజీలను కలుపుకొంటే జేఎన్టీయూ కళాశాలల సంఖ్య ఏడుకు చేరింది.

గతంలో మహబూబాబాద్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటించినప్పుడు మానుకోటకు ఇంజినీరింగ్‌ కాలేజీ మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు.

ఇంజినీరింగ్‌ కాలేజీ మంజూరుతో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నెరవేరినట్టయింది.

(సి.హెచ్.ప్రతాప్)