అంగట్లో అరటిపళ్ళులా సదరం సర్టిఫికెట్లు
*దివ్యాంగ సంక్షేమ సంఘం ముసుగులో అమాయకుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న అమలాపురం వాసి..!!
*అనర్హులకు భారీగా అందుతున్న ప్రభుత్వ సొమ్ము, *పట్టించుకోెని అధికారులు.ముడుపులు కోసం అనర్హులకి కూడా సర్టిఫికెట్లు మంజురు చేస్తున్నట్లు సమాచారం.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆగస్టు 14,( నిజం న్యూస్) బ్యూరో:
ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ 4వేలు నుండి 5 వేల వరకు పెంచి వారి ఆసరా కోసం ఇవ్వడంతో దానిని అవకాశంగా తీసుకున్న అమలాపురానికి చెందిన కొందరు కలసి ఒక ముఠాగా ఏర్పడి ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందితో కలసి సదరం సర్టిఫికెట్ల దందాను సాగిస్తున్నారు.
ఈ క్రమంలో.. అక్రమార్కులకు 20 నుంచి 40 వేల రూపాయలు ఇచ్చినట్లయితే ఏ వ్యక్తికైనా పేషంట్ అవసరం లేకుండానే సదరం సర్టిఫికెట్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం అని చెబుతున్నట్లు సమాచారం.
ప్రభుత్వ వైద్యులకు, మిగిలిన వారికీ తాను చెప్పిందే వేదమని వారికి కావాల్సిన ముడుపులు తామే అందిస్తామని ఇప్పటివరకు జిల్లాలో చాలామందికి సర్టిఫికెట్స్ ఇచ్చానని ఎటువంటి భయం లేకుండా తన వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉందని,
పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారని వారికీ కూడా ముడుపులు ఇస్తామని అందుకు సుమారు 20 నుంచి 40 వేల వరకు అవుతుందని నమ్మిస్తూ అమాయక పేషెంట్లు, అర్హత లేని వ్యక్తులను టార్గెట్ చేసి వారిని ఆర్థికంగా దోచేస్తూ అంగట్లో అరటి పళ్ళు మాదిరిగా సదరం సర్టిఫికెట్లను యదేచ్చగా పంపిణీ చేస్తున్నారని సమాచారం.
ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్టు తమకు ముడుపులే ప్రధానం అనుకొని జిల్లా వైద్య శాఖ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ అక్రమ దందాపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పోలీసు శాఖ ద్వారా విచారణ జరిపించి అలాంటి ముఠాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని ఉక్కు పాదంతో అణచివేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.