బిజెపికి ఊహించని షాక్
– మాజీ మంత్రి డాక్టర్ ఎ చంద్రశేఖర్ రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణా బి జె పి కిఊహించని షాక్ తగిలింది. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ ఎ చంద్రశేఖర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.
ఇందుకు సంబంధించిన రాజీనామా పత్రాన్ని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. తెలంగాణ రాజకీయాలలో గత 35 ఎళ్ళుగా మకుటం లేని మహారాజుగా, అజాతశత్రువుగా వెలుగుతున్న డాక్టర్ చంద్ర శేఖర్ 1985 నుండి వికారాబాద్ లో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే కొంతకాలంగా బిజెపి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. బిజెపి వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న చంద్రశేఖర్ పార్టీని చివరకు వీడారు. కాగా, ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది..
అయితే ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి లాంచనంగా ఆహ్వానించారు.
“త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నాను. ప్రజల్లో బిజెపి గ్రాఫ్ పడిపోయింది. తెలంగాణ ప్రభుత్వ అన్యాయాలను కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేస్తోంది. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శనాస్త్రాలు గుప్పించిన బి ఆర్ ఎస్ తన స్వార్ధం కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇస్తొంది.
దీంతో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని ప్రజలు భావిస్తున్నారు” అని ఒక పత్రికా ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
కాగా ఈ నెల 18న తెలంగాణ పర్యటనకు వస్తున్న ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో చంద్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.
బిజెపికి రాజీనామా చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ నాయకులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో చంద్రశేఖర్ తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి మాటలు నమ్మి చంద్రశేఖర్ గతంలో ఆ పార్టీలో చేరారని తెలిపారు.
(సి.హెచ్.ప్రతాప్)