Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చదువుల తల్లి ఒడిలో మిస్టరీ మరణాలు

– బాసరలో ఏం జరుగుతుంది.?
– ఎందుకలా చనిపోతున్నారు..?
– ఆర్జీయూకేటీలోనే ఎందుకీ ఈ ఆత్మహత్యలు
– తాజాగా మరో విద్యార్థి బలవన్మరణం
– పోతున్న ప్రాణాలు.. తేలని కారణాలు

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో(నిజం చెపుతాం)
చింతపండు నరసయ్య

సరస్వతమ్మ ఒడిలోకి.. ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చిన వారు ‘మృత్యు కొయ్య’లకు వేలాడు తున్నారు..అసలు అక్కడ ఏం జరుగుతోంది.? వాళ్ళకు ఉన్న సమస్యలు ఏమిటి.? పరిష్కార మార్గాలు ఏమిటి.?

ఇలా ఎంత మంది చనిపోతే ప్రభుత్వం మేల్కొంటుంది.? లేని నిద్ర నటిస్తున్న అధికారులకు బుద్ది చెప్పేది ఎవరు.? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారన్న నివేదికలు ఏం చెప్తున్నాయి..
విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలు నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో కలకలం రేపుతున్నాయి.

ఇందులో చాలా మరణాలు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి.

జూన్‌లోనే ఇద్దరు విద్యార్థినులు తనువు చాలించగా, ఇటీవలే వర్సిటీలోకి అడుగుపెట్టిన కొత్త విద్యార్థి బలవన్మరణానికి పాల్పడడం కలచివేస్తోంది.

ఎందుకు రహస్యం ఉంచుతున్నారు ?
విద్యార్థుల ఆత్మహత్యలపై కమిటీలు వేసినా అసలు కారణాలు మాత్రం బయటకు రావడం లేదు. ఘటనలు జరిగినప్పుడు ఒకటి రెండు రోజులు హడావుడి చర్యలు తీసుకుంటూ ఆ తర్వాత చేతులు దులిపేస్తుకుంటున్నారు.

బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశానికి ఒకప్పుడు 20 వేల నుంచి 30 వేల మధ్య దరఖాస్తులు వచ్చేవి. వరుస ఘటనలతో ఇప్పుడు 10 వేల నుంచి 12 వేల మధ్యకు దరఖాస్తులు పడిపోవడం గమనార్హం.

బలవన్మరణాలు ఎందుకు..?
ఎంత ఒత్తిడి, ఎంత బాధ, భవిష్యత్తుపై ఎంత భయం కలిగి ఉంటే.. ఓ 17ఏళ్ల విద్యార్థి ని బాత్రూమ్‌లో.. అదీ ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌కు తన చున్నీతోనే ఉరేసుకుంటుంది..? జూన్‌ 13న సంగారెడ్డికి చెందిన వడ్ల (17) ఇలానే ప్రాణాలు తీసుకుంది. ఆమె చనిపోయిన రోజే నలుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ వేసినా.. ఇప్పటికీ కారణాలు బయటపెట్ట లేదు.

ఏమిటా మిస్టరీ..
ఇక దీపిక మృతిచెంది రెండురోజులు కూడా గడవకముందే తనతోపాటే పీయూసీ1 చదువుతున్న గజ్వేల్‌కు చెందిన బుర్ర లిఖిత జూన్‌ 15న అర్ధరాత్రి తర్వాత గంగా బ్లాక్‌ నాలుగో అంతస్తుపై నుంచి పడి మరణంలోనూ ఏదో మిస్టరీ ఉందన్న వాదనలు ఇప్పటికీ ఉన్నాయి.

తాజాగా ఈ నెల 8న సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ మండలం నాగాపూర్‌కు చెందిన జాదవ్‌ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కౌన్సెలింగ్‌ చేస్తున్నారా..లేదా?
విద్యార్థుల మృతిపై ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఇటీవల బాసర సరస్వతీమాత ఆలయంలో హుండీ లెక్కించగా, అందులో తల్లిదండ్రులు రాసిన లేఖ బయటపడింది. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఏకంగా ముగ్గురు కౌన్సిలర్లతో కూడిన డిపార్ట్‌మెంట్‌ ఉంది. అసలు ఆ విభాగం ఏం చేస్తోంది.. “నూతన విద్యార్థులకు తరచూ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారా, లేదా..?” అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఇక బాసర ఆర్జీయూకేటీలో సమస్యలు, మరణాలపైనా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఏం జరుగుతోంది..?
అసలు.. బాసర ఆర్జీయూకేటీలో ఏం జరుగుతోంది? విద్యార్థులు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారో ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. జూన్‌లో ఇద్దరు విద్యార్థినులు చనిపోయినప్పుడు నలుగురు సభ్యులతో వేసిన కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో బయటకు రాలేదు.

ఇదెక్కడిమానవత్వం
ఇక కళాశాల విద్యార్థులు చనిపోతే ఆ మృతదేహాలను అనాథ శవాల్లా ఒకరిద్దరు సెక్యూరిటీ గార్డులతో మార్చురీకి తరలించేసి యాజమాన్యం దులిపేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులు కొన ఊపిరితో ఉన్నప్పుడే ఆస్పత్రులకు పంపించామని చెబుతున్న అధికారులు, బాసరకు దగ్గరగా ఉన్న నిజామాబాద్‌కు పంపించాలి కానీ.. దూరంగా ఉన్న నిర్మల్‌కు ఎందుకు పంపిస్తున్నారన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి..

ఉపకులపతి సార్ కౌన్సెలింగ్ చేయాల్సింది ఎవరికి…?

ఆయనో ఉపకులపతి. ఈ సందర్భంలో మనోధైర్యం చెప్పాల్సింది విద్యార్థినీ, విద్యార్థులకు… మరి ఆయన ఓ విఐపి గెటప్ లో తన కింద ఉద్యోగులతో తూ..తూ మంత్రంగా ఓ సమావేశం నిర్వహించి వెళ్ళారు. తక్షణం చేయాల్సిన పనులకు ‘టైం’ పెట్టి వెళ్ళారు.
ఆయన ఏం చెప్పాడో చూడండి

విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దని ధైర్యంతో ఉండాలని ఉపకులపతి వెంకటరమణ అన్నారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై విశ్వవిద్యాలయంలో గత బుధవారం అధ్యాపకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

మృతి చెందిన విద్యార్థికి ఉపకులపతి వెంకటరమణ, అధ్యాపకులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. విద్యార్థి కుటుంబానికి రూ.1.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రతి వసతి గృహంలో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయాలని వార్డెన్లకు ఆదేశించారు.

ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే రాసి పెట్టెలో వేయాలన్నారు. ఆత్మహత్యల నివారణకు విద్యార్థులతో గ్రూపులను తయారు చేసి వారితో ఇంటి విషయాలతో పాటు కళాశాలలో ఉన్న ఇబ్బందులపై చర్చించడం జరుగుతుందన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులతో వారం పదిరోజుల్లో ఆర్జీయూకేటీ ప్రధానద్వారం వద్ద లంచ్‌ ఏర్పాటు చేయిస్తామన్నారు. విద్యార్థులతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడిన నేరుగా చెప్పకుండా చరవాణిలో గాని మొయిల్‌ ద్వారా చెప్పుకొనే అవకాశం కల్పిస్తున్నామని, దాని కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి…వీ.ఆర్.ఏల నియామకాలలో ఇష్టారాజ్యం..?