త్వరలో పర్యావరణహిత బస్సులు తీసుకురానున్న టిఆర్ టిసి
శిలాజ ఇంధనాల వినియోగంపై ప్రపంచ వ్యాప్తంగా నియంత్రన తీసుకురావాలని ఐక్య రాజ్య సమితి దిశానిర్దేశనం చేసిన వేళ తెలంగాణా ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ ప్రయాణికులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రేటర్ హైదరాబాద్ లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం అయ్యాయి.
పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తెలంగాణా ఆర్ టి సి తీసుకురాబోతుంది.
ఇందులో భాగంగా వచ్చే ఆరు నెలలలోపే త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తెచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ ప్రణాళికలో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఆర్ టి సి ఇచ్చింది అని సమాచారం.
అందులో 500 బస్సులను హైదరాబాద్ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే విజయవాడ రూట్ లో 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.
హైదరాబాద్ లో తొలి దశలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయి. వాటిలో 20 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరుగుతాయి.
మరో 30 ఐటీ కారిడార్ లో నడుస్తాయి. వాటిలో 25 బస్సులను త్వరలోనే ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ పర్యావరన హిత బస్సులు ఇప్పటికే ముంబయి, దిల్లి, చెన్నయి వంటి మహానగరాలలో వినియోగంలో వున్నాయి.
ఎలక్ట్రిక్ ఏసీ బస్సు లో ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి.
35 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సుల్లో మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు సీటు బెల్ట్ సదుపాయం ఉంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సులో నాలుగు ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు.
అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్)ను ఏర్పాటు చేశారు.
ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు.
(సి.హెచ్.ప్రతాప్)