Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు

2014 లో కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి సాగునీటి ప్రోజెక్టులపై రాష్త్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికీ త్రాగు నీరు అందించే బృహత్తర ప్రోజెక్ట్ పూర్తి చేసి రాష్ట్రంలో కోట్లాది మంది తాగు నీటి అవసరాలను తీర్చింది.

అట్లే అతి ప్రతిష్టాకరమైన కాళేశ్వరం ప్రోజెక్టి ను అనతి కాలంలోనే పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగు నీటిని అందించింది. దానితో బీడుగా వున్న లక్షలాది ఎకరాలు ఇప్పుడు సస్య శ్యామలం అవుతున్నాయి.

తాజాగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ మరొక కీలక పురోగతి సాధించింది. పాలమూరు జిల్లా వాసుల దశాబ్దాల కలను సాకారం చేసే తీపి కబురు కేంద్రం నుంచి ఇప్పుడే అందింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి.

ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫారసు చేసింది.

దీంతో అనుమతుల మంజూరు లాంఛనం కానుంది.పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్న కరవుకాటకాలతో సతమతమయ్యే పాలమూరు జిల్లా కష్టాలు తీరే రోజే దగ్గర్లోనే ఉన్నాయి.

బీడు భూముల్ని తడుపుకుంటూ కృష్ణమ్మ బిరబిరా తరలి రానుంది. పాలమూరు-రంగారెడ్డి పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ఈ అనుమతులు మంజూరు వెనుక చాలా తతంగం నడిచింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 34వ ఈఏసీ సమావేశం నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది..

ఈఏసీ సభ్యులు రకరకాల సందేహాలను లేవనెత్తుతుండటంతో అనుమతుల్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఒక దశలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరును సైతం తిరస్కరిస్తూ ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కనపెట్టింది.

అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ఈఏసీ కోరిన విధంగా సంబంధిత డాటాను సమర్పించింది.

ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని ఈఏసీకి తెలంగాణ సర్కారు గతంలో విజ్ఞప్తి చేసింది. చిట్టచివరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు ఫలించాయి. పర్యావరణ అనుమతులు మంజూరు అయ్యాయి.

ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా, అనుమతుల సాధనలోనూ తెలంగాణ ప్రభుత్వం మరోసారి సాటిలేదని నిరూపించుకోంది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ఈఏసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తులు కేసీఆర్ ఘ‌న‌త అని హ‌రీశ్‌రావు కొనియాడారు. కేసీఆర్ మొక్క‌వోని దీక్ష‌కు నిద‌ర్శ‌నం ఇది. ప్ర‌భుత్వం ప‌ట్టువిడ‌వ‌ని ప్ర‌య‌త్నం తోడై సాధించిన ఫ‌లిత‌మిది.

ఇది మాట‌ల్లో వ‌ర్ణించ‌లేని మ‌ధుర ఘ‌ట్టం. పాల‌మూరు బీళ్ల దాహార్తిని తీర్చే ప్ర‌జ‌ల త‌ల‌రాత‌ను మార్చే ఈ ప్రాజెక్టుకు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు రావ‌డం అపూర్వ ఆనందాన్ని ఇస్తుంద‌ని హ‌రీశ్‌రావు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.