Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గడువు దాటిన మందులు, నిషేధిత డ్రగ్స్ లభ్యం 

మండలంలో మెడికల్‌ షాపులు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిరక్షరాస్యులు అధికంగా గ్రామీణ ప్రాంతాలలో కనీస నిబంధనలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో మెడికల్‌ షాపుల యజమానులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్నది.నిబంధనల ప్రకారం…మెడికల్‌ షాపును నిర్వహించాలంటే సంబంధిత షాపు యజమాని బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ పట్టభద్రుడై ఉండాలి.

ఫార్మసిస్టుల ద్వారానే మందుల విక్రయం జరగాలి. షాపులో పరిశుభ్రత పాటించడంతో పాటు ప్రిజ్‌, గ్లాసుతో కూడిన ర్యాకులో మందులు ఉంచాలి.

రిజిస్టర్‌, బిల్‌ బుక్‌, కాలం చెల్లిన మందులను ఎప్పటికప్పుడు తీసేయాల్సి ఉంటుంది.అలాగే, ప్రభుత్వం ఆసుపత్రులకు సరఫరా చేసే మందులు, మెడికల్‌ రిప్రజంటేటివ్స్‌ ఇచ్చే శాంపిల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదనే నిబంధనలు ఉన్నాయి.

మందులు తయారీ గడువు ముగియడానికి ముందు వాటిని ఆరు నెలల ముందుగానే ప్రత్యేకంగా విడిగా ఉంచాలి. కొన్ని షాపుల్లో తయారీ గడువు ముగియడానికి నెల రోజుల ముందుతో పాటు గడువు దాటుతున్న విక్రయిస్తున్న సంఘటనలు మండలంలో గోవిందాపురం (ఎల్) గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

ప్రజల నిరక్షరాస్యతను,అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న సదరు శ్రీ వెంకట గాయత్రి మెడికల్ అండ్ జనరల్ స్టోర్ లో అడిషనల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ జి.ప్రసాద్ తోపాటు,డ్రగ్ ఇన్స్పెక్టర్ ఈ నెల 4వ తేదీన తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలో భాగంగా షాపు యజమాని కల్యాణపు కిరణ్ నిబంధనలకు విరుద్ధంగా యధేచ్చగా గడువు దాటుతున్న మందుల విక్రయాలు సాగిస్తున్నారు.అంతటితో ఆగకుండా నిషేధిత డ్రగ్స్ అమ్ముతూ మందులతో పట్టుబడ్డారు.

ఇదే షాపులో ఇనుప వస్తువులు కూడా అమ్ముతుండడం గమనార్హం సదరు షాపు యజమానికి అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు.

ఇదిలా ఉండగా ఔషధ నియంత్రణ శాఖ అధికారుల నిఘా వైఫల్యం కారణంగా మెడికల్‌ షాపుల యజమానులు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు మండల వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి.

బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పట్టభద్రుల సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని మందులపై ఏమాత్రం అవగాహన లేకుండానే విక్రయిస్తున్నట్లు వారు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తరచూ మెడికల్‌ షాపులలో తనిఖీలు నిర్వహించాలని అయితే, అధికారుల నిర్లక్ష్యం, తరచూ తనిఖీలు లేని కారణంగా మెడికల్‌ షాపుల యజమానులు నిబంధనలు ఉల్లంఘించి ప్రజారోగ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నట్లు వారు ఆరోపణలు వినిపిస్తున్నారు.

ఇంత జరిగిన సదరు షాపు యజమానికి నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు తప్ప ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఇప్పటికైనా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పందించి నిబంధనలు ఉల్లంఘించే మెడికల్‌ షాపులపై తగిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.