Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విశ్వకర్మ కుటుంబంతో ఆడుకున్న విధి

అయ్యా కలెక్టర్ సారు వీరి దీనస్థితి చూసి ఆదుకోండి.

కరోనాతో కన్నుమూసిన మామ,భర్త..

ముగ్గురు పసిపిల్లలతో, రూ.15లక్షల అప్పుతో జీవచ్చవంలా మిగిలిపోయిన అబాగ్యురాలు..

నాపిల్లలకు హాస్టల్ లో సీటు ఇవ్వండి.. నాకు బతుకుదెరువు చూపండని వేడుకోలు..

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, ఆగస్టు 10,( నిజం న్యూస్):

అంతవరకు ఆనందంగా ఉన్న ఆకుటుంబాన్నికాలంకాటేసింది. కరోనా బారిన పడి భర్త,మామ వెంటవెంటనే కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్సకు రూ.15లక్షలు అప్పులు చేసి మరీ ఖర్చుపెట్టారు. అయినా ప్రాణాలు దక్కలేదు.

అంతదాకా గృహిణిగా ఉంటూ ఇంటి గడప దాటని ఆ.ఇల్లాలుకు ఒక్కసారిగా ముగ్గురు పిల్లలతోపాటు, కుటుంబభారం మీదపడింది.

చావాలని మనసుపోరుపేట్టినా.. ఆత్మహత్య చేసుకునే ధారుణమైన పరిస్థితి ఒక్కసారిగా ఏర్పడినా..! అన్యపుణ్యంతెలియని ముగ్గురు కన్నబిడ్డలు కళ్ళముందు కదులుతుంటే పుట్టేడు దుఖంతో బతుకుబండిని బలవంతంగా లాగుతోంది.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకోత్తపల్లి గ్రామానికి చెందిన చిల్ముల ప్రసాద్ చారి, గ్రామంలో నలుగురికి తలలో నాలుకలా ఉండేవాడు. ఆయన తండ్రి వెంకట్రామయ్యచారి కుమారుని తోపాటే ఉంటూ చెరో పని చేస్తూ ఆనందంగా జీవించేవారు.

ప్రసాద్ చారికి బార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ విశ్వకర్మ కుటుంబాన్ని చూసి కాలానికి కన్నుకుట్టింది.విధి వీరిని వెక్కిరించింది.

కరోనాతో భర్త,మామ ఇద్దరు మరణించారు. ముగ్గురు పిల్లలతో చికిత్స కోసం చేసిన రూ.15లక్షల అప్పులతో ఆ ఇల్లాలు దిక్కులేని స్థితిలో చిక్కుకుంది.

ఎన్నోసార్లుచావాలనిపించినా, ముగ్గురు పసిపిల్లలను చూసి బోరున విలపిస్తూ, విధిని తిట్టుకుంటూ జీవితాన్ని లాగుకొస్తుంది. మూడు సంవత్సరాలుగా ఇదే విషాదం.! ఆ అబాగ్యురాలు ఇప్పుడు దీనంగా చేతులుజోడించి ప్రభుత్వ పెద్దలను, ప్రజాప్రతినిధులను, అధికారులను అర్దిస్తుంది.

నా పిల్లలకు చదువుకోవడానికి గురుకులంలో సీట్లు ఇవ్వండి!

అప్పుల్లో చిక్కుకున్నాం. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సాయం చేయండి.

ఎక్కడో ఒకచోట కనీసం వంటపనో.ఊడ్చేపనో అయినా ఇప్పించి ఉపాధి కల్పించండి అని దీనాతి దీనంగా జిల్లా కలెక్టర్ ను చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటుంది.

ఈ సమాజంలో మా కుటుంబం ఉందని కనీసం గుర్తించండి.

బతుకుబారం అనుకోకముందే కనీసం పలకరించండి.

మేమున్నాం అని ఓ భరోసా ఇవ్వండంటూ ఆ తల్లి కన్నీటితో వేడుకుంటుంది.

మన పాలకుల మనసు కరగాలి. ముగ్గురు పసిపిల్లలకు చక్కని చదువులు అందాలి.

ఆ ఆడబిడ్డ తన కాళ్ళమీద తాను నిలబడేలా తన పిల్లలను ప్రయోజకులను చేసేలా దైర్యం పెంచే ఉపాధి లభించాలని ఒక మహిళ ఎంపీగా, మరొక మహిళ రాష్ట్ర మంత్రిగా దేశాన్ని రాష్ట్రాన్ని ఏలుతున్న ఆణిముత్యాలు

ఉన్న ఈ జిల్లాలో ఒక మహిళ మనోవేదనను అర్థం చేసుకుంటారని, ఒకవేళ వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేసినా ప్రయోజనం ఉండదు. చావు కోసమే ఎదురు చూస్తున్న ఆ మహిళ పిల్లల కోసం స్పందిస్తారని కోరుకుందాం.