Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆపరేషన్ తెలంగాణా షురూ..

– జోరు పెంచిన టి కాంగ్రెస్

(ప్రత్యేక కధనం: ప్రతాప్)

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆపరేషన్ తెలంగాణకు కాంగ్రెస్ తెరలేపింది. వరుస సభలు,సమావేశాలు నిర్వహించాలని హైకమాండ్ నిర్ణయించింది. కేడర్‌లో జోష్ పెంచేలా కార్యచరణ రూపొందిస్తోంది. ఈ దిసగా ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి కేంద్ర అధినాయకత్వం స్పష్తమైన దిశా నిర్దేశం చెసినట్లు తెలుస్తోంది.

ఆగష్టు 15 వ తేదీ నుండి అన్ని నియోజకవర్గాలలో ఆయా ప్రాంతాలకు చెందిన నేతలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించి సభలు, బైక్ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించాలని పిలుపు నిచ్చింది. ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరిన ఇతర పార్టీ నాయకులకు పార్టీ ప్రచారంలో మరింత బాధ్యతలు ఇవ్వాలని అధినాయకత్వం నిర్ణయించింది.

ఇక ముఖ్యంగా సెప్టెంబర్ 17న తెలంగాణలో సోనియా గాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే రోజు మేనిఫెస్టోతో పాటుగా సెంటిమెట్ అస్త్రాలను సంధించేందుకు సిద్దమవుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా సెంటిమెంట్‌ను మరోసారి తెరపైకి తీసుకువచ్చే విధంగా సభను ప్లాన్ చేస్తున్నారు.

అయితే అదే సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారా లేక ఆయన విడిగా తెలంగాణాలో పర్యటిస్తారా అన్నది ఇంకా తేలలేదు. ఈ నెల 18న హైదరాబాద్‌లో ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు.ఇందులో ఖర్గేతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.

తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ప్రముఖ బి సి నాయకుడు సిద్దరామయ్యతో సూర్యాపేటలో బీసీ గర్జన సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో సిద్దరామయ్యతో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించేందుకు కార్యచరణ రూపొందించాయి.

సెప్టెంబర్‌లో తెలంగాణలో . ప్రియాంకగాంధీతో బహిరంగ సభలో మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించడానికి కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. ఇక క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ అధిష్టానం భారీ కసరత్తులు చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రానికి ఏఐసీసీ కార్యదర్శులుగా ఎన్‌ఎస్ బోస్ రాజు, శ్రీనివాసన్ కృష్ణన్, సలీమ్ అహ్మద్‌లను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు.వీరికి పార్టీ ప్రచార బాధ్యతలను కూడా అప్పగించారు.

తెలంగాణలో బలపడడానికి కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని ప్రయత్నాలు చేస్తునట్లు స్పష్టమౌతోంది. రెండు సార్లు సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో, ఈ సారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది.

అందుకే టీ కాంగ్రెస్ సీనియర్లు, టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎక్కడ ప్రచారం నిర్వహించినా… తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని వ్యాఖ్యలు చేస్తున్నారు.